కుంచెతో కళారూపాలకు ప్రాణంపోస్తారు సయీదా అలీ. విశాఖలో పుట్టారు. ఆరోఏటే చిత్రకళలో అడుగుపెట్టారు. సయీదాకు వినిపించదు. మొదట్లో కొద్దిగా ఉన్న సమస్య.. ఆ తర్వాత పూర్తిగా ఆవహించింది. అయినా ఆమె కళాసృష్టి ఆగలేదు. రెట్టించిన ఉత్సాహంతో చిత్రకళకు మరింత వన్నెలద్దారు. అద్దంపై చిత్రకళను ఆవిష్కరించే రివర్స్ పెయింటింగ్‌పైనా.. పట్టుసాధించారు. తన మనసుకు ఏమనిపిస్తే దాన్ని చిత్రకళద్వారా ఆవిష్కరించే సయీదా.. సంక్రాంతి పండగలో కీలకమైన గంగిరెద్దుల చిత్రాలతో ఒక సీరీస్ రూపొందించారు. డూడూ బసవన్నల రాజసాన్ని, వాటి విన్యాసాల్ని కుంచెతో అచ్చుగుద్దినట్లు దించేశారు సయీదా.
ఆంధ్రా వర్సిటీ ఫైన్‌ఆర్ట్స్ విభాగంలో బాచిలర్స్ డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయవర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు సయీదా. వివాహానంతరం కుటుంబానికి సమయం వెచ్చిస్తూనే.. తనకిష్టమైన చిత్రకళను వదులుకోలేదు. కెనడా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో తన రంగుల ప్రపంచాన్ని అక్కడ పరిచయం చేసి.. శభాష్ అనిపించుకున్నారు. తనలో ఉన్న లోపం.. తనకెప్పుడూ అడ్డంకి కాలేదంటున్నారు సయీదా.
కేజీ సుబ్రమణ్యన్, కె.లక్ష్మణగౌడ్ వంటి ప్రముఖ చిత్రకారుల ప్రశంసలే.. తనకు అవార్డులని సంతోషపడుతున్నారు సయీదా.
ఇదీ చదవండి: జీవన సరళి మారుతోంది.. నాటి సంస్కృతికి ఆదరణ పెరుగుతోంది!