విశాఖలో ఒక కుటుంబంలో కరోనా అంతులేని వేదన మిగిల్చింది. వైరస్ కాటుకు పది రోజుల వ్యవధిలోనే నలుగురు కుటుంబసభ్యులు తనువు చాలించారు. విశాఖ సీతమ్మపేటకు చెందిన నాగప్రసాద్ తల్లిదండ్రులను, సోదరుడిని, అత్తగారిని కోల్పోయాడు. నాగప్రసాద్ కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కరోనా బారిన పడిన తల్లిదండ్రులకు సేవచేద్దామని వచ్చిన తన సోదరుడు మృత్యుఒడికి చేరడం నాగప్రసాద్‌ని మరింత కలిచివేస్తోంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా కాటుకు భార్యభర్తలు ప్రాణాలు విడిచారు. మూడు రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయామని పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ముక్కపాడు గ్రామంలో 2 రోజులుగా రోడ్డు పక్కనే వృద్ధుడి మృతదేహం పడి ఉన్నా..అతడికి కరోనా ఉందేమోనన్న అనుమానంతో ఎవరూ ముందుకు రాలేదు. ఊరిలోనే అతడి భార్య, కుమార్తె ఉన్నా రాలేదన్న గ్రామస్థులు...అధికారులైనా పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు గ్రామంలో ఓ మహిళ కరోనాతో మృతిచెందగా..ఆమె అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ముందుకు రాలేదు. చివరికి వీఆర్వో ఉదయ్ భాస్కర్, గ్రామ కార్యదర్శి రమణరావు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనా బారినపడి ఆక్సిజన్ అందలేని స్థితిలో క్షణ క్షణానికి తండ్రి ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో చెంతనే ఉన్న కొడుకు..తన తండ్రిని రక్షించుకునేందుకు చివరి వరకు పోరాడాడు. కానీ చివరికి వైరస్‌దే పైచేయి అయ్యింది. తన కళ్లఎదుటే తన తండ్రి ప్రాణాలు విడిచాడు. హృదయ విదారకమై ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో జరిగింది. గుండెలు పిండేసేలా ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కన్న బిడ్డ తన ఉంటున్న ఇళ్లు అమ్మేయగా..తల్లి అద్దె ఇంట్లో ఉంటూ పింఛన్ డబ్బులతో నెట్టుకొస్తోంది. వృద్ధురాలు అయిన ఆమె....ఇటీవల కరోనా బారినపడగా.....ఇంటి యజమాని సామగ్రి అంతా బయటపడేసి....ఆమెను రోడ్డున నిలబెట్టాడు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఇంటి యజమానికి సర్దిచెప్పి …తిరిగి అద్దె ఇంట్లో ఉండేలా ఒప్పించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈ విషయం తెలుసుకొని ఆమెను ఆసుపత్రిలో చేర్చేలా చర్యలు చేపట్టారు.
కృష్ణా జిల్లా తిరువూరులోని ఒక అపార్ట్‌మెంట్ నుంచి స్థానికంగా ఉన్న వెలుగోటి యూత్ సభ్యులకు ఫోన్ వచ్చింది. వృద్ధురాలు కరోనాతో చనిపోయిందని... ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లమని కోరారు. అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లిన వృద్ధురాలు బతికే ఉండటం చూసి అవాక్కయ్యారు. బతకుండగానే చనిపోయిందని చెప్పిన వృద్ధురాలి కుమారుడు, కోడలు...ఆమె వద్ద ఉన్న బంగారు వస్తువులు మాత్రం తీసి ఇమ్మని స్వచ్ఛంద సేవకులను కోరడం అందర్నీనివ్వెరపరిచింది. చివరకు వృద్ధురాలిని వెలుగోటి యూత్ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.
తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ తో చనిపోతున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. మృతదేహాల వాహనాలు శ్మశాన వాటికలకు తరలివస్తూనే ఉన్నాయి. కాకినాడలో విజ్జపురెడ్డి వారి హిందూ శ్మశాన వాటికలో మృతదేహాలు చితి మంటలు రగులుతూనే ఉన్నాయి. మృతుల కడచూపులకు అయినవారు రాకుండానే....అంత్యక్రియలను ముగిస్తున్నారు.
ఇదీచదవండి