విశాఖ నగరంలోని 98 డివిజన్లలో.. కొత్త కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో అధికంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
లాక్డౌన్ నిబంధనలు సడలింపు వల్ల దాదాపుగా అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారు. రెస్టారెంట్లు కూడా తెరుచుకోవటంతో...ప్రజల తాకిడి పెరిగింది. నగరంలో కంటైన్మెంట్ నిబంధనల ప్రకారం 500+500 మీటర్ల వరకు వెరీ యాక్టివ్ క్లస్టర్లలో రాకపోకలను నియంత్రించారు. కనిష్టంగా ఈ నియంత్రణ 200 మీటర్ల వరకు ఉంటుంది. ఇలాంటి ఆంక్షలు ఉన్న ప్రాంతాలు దాదాపు 75 వరకు ఉన్నాయి. కొన్ని క్లస్టర్లలో కొత్తగా కేసులు నమోదు కాకపోవడం వల్ల వాటిలో ఆంక్షలు ఎత్తేశారు.
బయట ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగడం వల్ల కేసులు కూడా వేగంగానే పెరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. కేవలం 15 రోజుల్లోనే 225 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు. మే నెలలో కరోనా కేసులు తాకిడి పెరుగుతూ వచ్చింది. మే 31 నాటికి కేసుల సంఖ్య 113 కేసులకు చేరింది. ఆ తర్వాత కేవలం ఎనిమిది రోజుల్లోనే 99 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకూ అంటే ఆరు రోజుల్లోనే 104 కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతను సూచిస్తోంది. ఒక్క జూన్ నెలలోనే ఇప్పటివరకు 210 కొత్త కేసులు నమోదయ్యాయి.
విమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులను, వెంటిలేటర్ అవసరం ఉన్న కేసులను ఉంచుతున్నారు. గీతం, గాయిత్రి, ఛాతీ ఆసుపత్రులలోను కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా... ఇప్పటివరకూ 143 మంది కేసులు డిశ్చార్జి అవడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండటంతో కొంత ఊరటనిస్తోంది.
ఇదీ చదవండి : విశాఖ కేజీహెచ్‌లో సిబ్బంది కొరత.. రోగుల అవస్థలు