దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అసంఘటిత రంగంలో భవన నిర్మాణ రంగంపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగంలో ఎన్ని సమస్యలున్నా రోజువారీ కూలీలకు మాత్రం ఎంతో కొంత పని కచ్చితంగా దొరికేది. నిర్మాణ రంగంలో వర్కింగ్ సీజన్ జనవరి నుంచి మొదలై... రుతుపవనాలు వచ్చే వరకు ముమ్మరంగా ఉంటుంది. కరోనా ప్రభావంతో.. ఈ రంగం స్తంభించిపోయింది. లాక్డౌన్తో నిర్మాణాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. లాక్డౌన్ సడలింపులతో నిర్మాణ రంగంలో పనులు తిరిగి ప్రారంభమైనా పరిస్థితి మారలేదు.
పని కోసం నిరీక్షణ
ఉత్తరాంధ్రలో ప్రధాన నగరమైన విశాఖలో... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కూలీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలోనే సుమారు 25 వేల మంది కూలీలు జీవనం సాగిస్తున్నారు. కూలీ పనుల కోసం ఉదయం నుంచి రహదారులపై నిరీక్షించే వీరికి.. గతంలో మాదిరి పెద్ద సంఖ్యలో పనులకు తీసుకువెళ్లే పరిస్థితి లేదు.
మందుతో చిక్కులు
లాక్డౌన్కి ముందు పని కోసం ఎక్కువ రోజులు నిరీక్షించాల్సి వచ్చేది కాదు. ఇప్పుడు మాత్రం నిరీక్షణ సమయం బాగా పెరిగిపోయిందని కూలీలు ఆవేదన చెందుతున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతుంటే.. మద్యం షాపులు తెరుస్తున్న కారణంగా.. వచ్చిన ఆ కాస్త డబ్బులనూ మందుకే తగలేస్తున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారు.
పని దొరికేది రెండు, మూడు రోజులే
విశాఖ నగరంలోని దాదాపు 30 నుంచి 40 ప్రధాన ప్రాంతాల్లో... ఉదయమే వేల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పనులకు వెళ్లేందుకు రోడ్లపై వేచి చూస్తుంటారు. లాక్డౌన్కి ముందు వీరికి సగటున వారంలో 5 రోజులు పని లభిస్తే ఇప్పుడు మాత్రం 2 నుంచి 3 రోజులు మాత్రమే దొరుకుతుంది. పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కూలీలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
సుప్రీం తీర్పును జీర్ణించుకోలేకే అరెస్టులు: తెదేపా నేత పట్టాభి