విశాఖ జగదాంబ కూడలిలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. భూమి విలువ చూసిన ముఖ్యమంత్రికి త్యాగం విలువ తెలియదని అన్నారు. విశాఖ ఎన్నికలు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌ను వైకాపా తీసుకురాలేదన్న చంద్రబాబు.. విశాఖకు 3 రాజధానుల ముచ్చట మాత్రం చెప్పారని విమర్శించారు.
అంతకుముందు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పాల్గొన్న చంద్రబాబు.. తప్పకుండా తాను వచ్చి విశాఖ పాతపట్నం అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. 7వేల ఎకరాలు ఖాళీగా ఉంది.. అమ్మేద్దాం అంటున్నారని.. ఆటవిక రాజ్యాన్ని తేవాలని చూస్తున్నారని విమర్శించారు. అందర్నీ భయపెట్టడం రాజకీయమా? అని ప్రశ్నించారు.
విశాఖ జిల్లాలోని కోరమండల్ గేటు వద్ద తెదేపా అధినేత చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలివ్వం అంటారా? అంటూ అధికార పార్టీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారన్న ఆయన.. వడ్డీలు కట్టలేని పరిస్థితి వస్తే ప్రజల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. వైకాపా పాలనలో ఎక్కడ చూసినా వసూళ్ల పర్వం కొనసాగుతుందని ఆరోపించారు.
తెదేపా పాలనలో ఎక్కడైనా వసూళ్లు జరిగాయా? అంటూ ప్రశ్నించారు. విశాఖ ప్రజలంతా తన సొంత కుటుంబం అని అన్నారు. బెదిరించి విశాఖలోని భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. వైకాపాను గెలిపిస్తే రేపు అన్నీ లాక్కుంటారని అన్నారు. రౌడీలు, గూండాల నుంచి విశాఖను కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే.. వాలంటీర్లపై చర్యలు తప్పవు!