విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ బాధ్యతలు స్వీకరించారు. 2024 నవంబర్ 30 వరకు ఆయన సీఎండీగా కొనసాగనున్నారు. ఇప్పటివరకు మెకాన్ సంస్థకు సీఎండీగా అతుల్‌భట్ పని చేశారు.
అతుల్ భట్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్ 2025 రూపకల్పన చేసి పలు కంపెనీలు టేకోవర్, మెర్జింగ్లో కీలక పాత్ర పోషించారు. తర్వాత 2016 అక్టోబర్‌లో ఆయన ప్రభుత్వ రంగ సంస్ధ మెకాన్ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం ప్రభుత్వ వాటాల అమ్మకానికి కేంద్రం నిర్ణయించిన తరుణంలో ఈయన నియామకం.. ఈ కార్యచరణను వేగవంతం చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అతుల్ భట్ డిగ్రీ పూర్తి చేసిన తొలినాళ్లలో టాటా స్టీల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి ఆ సంస్ధల్లో కొన్నేళ్లు పని చేశారు. మిట్టల్ కంపెనీలో యూకెలో జీఎంగా, ఇరాన్ తదితర దేశాల్లోనూ పని చేసి పలు కంపెనీల మెర్జింగ్ వ్యవహారంలో కీలకమైన అనుభవాన్ని సంపాదించారు. అతుల్ భట్ దిల్లీ ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా...ఐఐఎం కొల్కత్తా నుంచి పీజీ పట్టా పొందారు. అతుల్ భట్‌ను అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: ఫార్మా వ్యర్థాలతో.. పరవాడ చెరువులో చేపలు మృత్యువాత