AP HIGH COURT: విశాఖపట్నంలోని రుషికొండలో హరిత రిసార్టు స్థానంలో నూతన నిర్మాణం కోసం విచక్షణ రహిత తవ్వకం, చెట్ల తొలగింపుపై హైకోర్టు స్పందించింది. తవ్వకాలు, నిర్మాణ వ్యవహారంలో విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని అధికారులను ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పోరేషన్ ఎండీ, కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్, వీఎంఆర్ డీఏ కమిషనర్, కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ , గనులశాఖ డైరెక్టర్ కు నోటీసులు జారీచేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం ఎండాడ గ్రామ పరిధి సర్వే నంబరు 19 లోని రుషికొండపై విచక్షరహితంగా తవ్వకాలు, చెట్ల తొలగింపు చేస్తున్నారని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ .. సముద్ర తీరాన ఉన్న కొండపై చెట్లను ధ్వంసం చేస్తున్నారన్నారు. జీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై తవ్వకాలు, నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఆ వాదనలపై స్పందించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
ఇదీ చదవండి:
TELANGANA GOVERNOR VISAKHAPATNAM TOUR: విశాఖలో రెండు రోజులపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటన