రాష్ట్రంలోని మూడు డిస్కంల ఆదాయ అవసరాలు, రిటైల్ టారిఫ్‌ల ప్రతిపాదనలపై 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 53 అభ్యంతరాలు వచ్చినట్లు ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తెలిపారు. విశాఖలోని ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి ఏపీఈఆర్‌సీ సభ్యులు ఠాకుర్ రామ్‌సింగ్‌తో కలిసి ఆన్‌లైన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని డిస్కంలపై సోమవారం ఆయన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈనెల 20వ తేదీ వరకూ ఇది కొనసాగే అవకాశం ఉండటంతో అభ్యంతరాలు ఉన్నవారు ఎవరైనా స్పందించవచ్చని పిలుపునిచ్చారు.
http://www.eliveevents.com/apercpublichearing/ లింక్‌లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ దగ్గర్లోని డీఈ, ఈఈ, ఎస్‌ఈ కార్యాలయాల ద్వారా మాట్లాడవచ్చని అన్నారు. సోమవారం హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి ప్రాంతాల నుంచి పలువురు తమ అభ్యంతరాల్ని వెల్లడించారు. ప్రధానంగా అవసరం లేకున్నా అధిక ధరలు చెల్లించి విద్యుత్తు కొంటున్నారని తెలిపారు.
పలు సంస్థల విషయంలో గత ప్రభుత్వాలు, డిస్కంలతో పాటు ఏపీఈఆర్‌సీ ఉదారంగా వ్యవహరించడంతో లోపాలు తలెత్తాయని ఆరోపించారు. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల అవసరం లేదని ఏపీఈఆర్‌సీ దృష్టికి తెచ్చారు. అంతకుముందు ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్థన్‌రెడ్డి తమ డిస్కంల స్థితిగతులను చదివి వినిపించారు. మరోవైపు ఈపీడీసీఎల్ కార్యాలయం బయటే సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిలిపేయాలని కోరడమేంటి?