విశాఖలోని ముడసర్లోవ రిజర్వాయరుపై 2 మెగా వాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సౌర విద్యుత్తు ప్రాజెక్టును నిర్మించింది జీవీఎంసీ. అలాగే నగరానికి సమీపంలోనే మేఘాద్రిగెడ్డలో మరో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సారి 3 మెగావాట్ల సామర్థ్యంతో నీటిపై సౌర విద్యుత్తు ప్యానెళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌కు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని జీవీఎంసీ ఎస్‌ఈ కేవీఎన్ రవి తెలిపారు. ఇది పూర్తయితే రెండు అతి భారీ ఫ్లోటింగ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టులకు ఈ ఏడాదిలోనే విశాఖలో చూసే అవకాశం కలుగుతుంది.
గ్రీన్ హౌస్ గ్యాస్‌ను తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టులపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి గమనాన్ని ఈ పలకలు అనుసరించేలా ఏర్పాటు చేయనున్నారు. కొవిడ్ నేపథ్యంలో పనులు కాస్త మందగించినా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి సాంకేతిక కార్మికుల్ని తెప్పిస్తున్నారు. సౌర ఫలకలు కూడా తెచ్చి సిద్ధం చేసి ఉంచారు. తాజా సాంకేతికతతో కూడిన పీవీ సోలార్ ప్యానెళ్లను ఇందులో వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.