రాష్ట్రంలో ప్రస్తుతం గంజాయి సృష్టిస్తున్న అలజడి ఎలాంటిదో తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో విశాఖ జిల్లా పాడేరు మన్యంలో యువత నడుం బిగించి గంజాయి ధ్వంసం చేయడంలో పాల్గొంటున్నారు. గంజాయి పంట వల్ల జరిగే అనర్ధాల గురించి ఇటీవలి కాలంలో పోలీసులు మారుమూల గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు కలిగించిన చైతన్యంతో యువత ముందుకెళ్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన.
విశాఖ అటవీ ప్రాంతమైన జి.మాడుగుల మండలం గెమ్మెలి సచివాలయంలో రత్నం మహిళా పోలీస్. గంజాయి సాగు నిర్మూలనలో భాగంగా అందరిలా కాకుండా ఆమె ఓ అడుగు ముందుకు వేశారు. తన పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి పండించే గ్రామాల్లో స్థానిక వాలంటీర్లకు గంజాయి పెంపకంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. తాము నివాసముండే ప్రాంతంలో గంజాయి లేకుండా చూడాలని గిరిజనులకు నచ్చజెప్పారు. అంతేకాదు తానే స్వయంగా గెమ్మెలి పంచాయతీలోని లువ్వాపల్లి, బలమానుసంక, గొడుగు రాయి చిలకలమామిడి గ్రామాల కొండల్లో వాలంటీర్లతో కలిసి గంజాయి తోటలు ధ్వంసం చేశారు. సుమారు పది ఎకరాల్లో 8 అడుగులు పెరిగిన గంజాయి తోటలు నరికివేశారు. ఓ మహిళా పోలీసు ధైర్యంగా ఇలా ఓ అడుగు ముందుకేయడమే కాకుండా ముందుండి నడిపించడం చూసి పోలీసు ఉన్నతాధికారులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.