విద్యాదీవెన... వైకాపా ప్రభుత్వం ఘనంగా చెప్పుకునే పథకాల్లో ఇదీ ఒకటి..! విద్యార్థుల ఫీజు మొత్తం తామే చెల్లిస్తామని ప్రచారాలూ చేసుకున్నారు. అయితే.. వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. ఈ విద్యా సంవత్సరం ముగుస్తున్నా 'విద్యాదీవెన' పథకం కింద బోధన రుసుములు పూర్తిగా చెల్లించడం లేదు. క్రమం తప్పకుండా.. ప్రతి త్రైమాసికానికీ ఫీజు చెల్లిస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా గతేడాది ఒక విడతకు ఎగనామం పెట్టింది. ఈ విద్యా సంవత్సరం దాదాపు ముగుస్తున్నా సగమే చెల్లించింది. ఫలితంగా.. కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. 2020-21లో ఒక విడత పెండింగ్‌తోపాటు.. 2021-22కు సంబంధించిన మొత్తం ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామనిహెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం బోధన రుసుములను తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తున్నందున.. వాటితో తమకు సంబంధంలేదని వాదిస్తున్నాయి. ఆ డబ్బు వస్తేనే.. ఫీజు చెల్లించాలనే నిబంధన ఎక్కడా లేదనీ ఒత్తిడి చేస్తున్నాయి. ఇలా అటు ప్రభుత్వవైఖరి, ఇటు కళాశాలల నిబంధనలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
2020-21 విద్యా సంవత్సరంలో డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలకు నాలుగో త్రైమాసికం బోధన రుసుములను ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. కరోనా వల్ల తరగతులు నిర్వహించలేదంటూ సుమారు 600 కోట్ల రూపాయలు మిగుల్చుకుంది. కరోనా ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ తరగతుల ద్వారా సిలబస్ పూర్తి చేసినందున.. ఏడాది మొత్తానికీ ఫీజులు చెల్లించాలన్నది కళాశాలల డిమాండ్. ప్రభుత్వం చెల్లించని 600 కోట్లను.. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఈ ఏడాది రెండు త్రైమాసికాలకు కలిపి ప్రభుత్వం 14 వందల 18 కోట్లు చెల్లించింది. మరో రెండు విడతలు ఫీజులను ఇంకా ఇవ్వలేదు. డిగ్రీ, బీటెక్ చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులకు.. ఒకటీ , రెండు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. వీరు గతేడాది రెండు, మూడు ఏడాదుల్లో ఉన్నప్పుడే.. ఒక త్రైమాసికం ఫీజు పెండింగ్ ఉంది. ఇప్పుడు రెండు విడతలు కలిపి మొత్తం మూడు త్రైమాసికాల ఫీజులు చెల్లించాలని కళాశాలలు పట్టు పడుతున్నాయి.
బీటెక్ మూడు, నాలుగో ఏడాది విద్యార్థులకు వచ్చే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. నాలుగో ఏడాది విద్యార్థులు చదువు పూర్తయ్యాక కళాశాల వీడితే ఫీజులు వసూలు కావని కళాశాలలు భావిస్తున్నాయి. సకాలంలో చెల్లించనందున అధ్యాపకులకు జీతాలు చెల్లించడమే కష్టమవుతోందని అంటున్నాయి. అయితే ఏదైనా ఉంటే కళాశాలలు, ప్రభుత్వం చూసుకోవాలి తప్ప.. తమను, తమ తల్లిదండ్రులను వేధించడం సరికాదని.. విద్యార్థలు వాపోతున్నారు. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించిన బీటెక్ విద్యార్థులు అకాడెమిక్ సంవత్సరం పూర్తి చేస్తేనే కొలువు లభిస్తుంది. పరీక్ష రుసుము చెల్లించాలన్నా, పరీక్షలకు అనుమతించాలన్నా.. ఫీజు మొత్తం చెల్లించాల్సిందేనని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులను మినహాయిస్తే.. ప్రైవేటులో చదివేవారిపై 3 త్రైమాసికాలు కలిపి సుమారు 2 వేల 500 కోట్ల రూపాయల వరకు భారం పడనుంది. ఇక.. ప్రభుత్వం చెల్లించే బోధన రుసుములతో తమకు సంబంధం లేదని కళాశాలలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఫీజుల భారం భరించలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ విధానాలను విద్యార్థి నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కళాశాలల ఖాతాల్లో జమయ్యే విధానాన్ని రాజకీయ కోణంతో పూర్తిగా మార్చారని మండిపడుతున్నారు. పీఠమెక్కాక ఫీజు మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చిన జగన్..ఇప్పుడు విద్యార్థులపై భారం మోపడం సరికాదంటూ పీడీఎస్యూ నేతలు హితవు పలికారు. విద్యార్థులకు కళాశాలలు కనీసం హాల్‌టికెట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు బోధన రుసుములను కేంద్రం 60 శాతం ఒకేసారి చెల్లిస్తోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిని వాడుకుని.. తర్వాత కళాశాలలకు చెల్లించేది. కానీ గతేడాది నుంచి నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోంది. మిగతా 40 శాతం ఫీజులను రాష్ట్రం నాలుగు విడతల్లో చెల్లిస్తోంది. ఈ విషయంపై అవగాహనలేని కొందరు తల్లిదండ్రులు.. కళాశాలలకు ఫీజులు చెల్లించలేదు. ఫలితంగా కళాశాలలు ప్రభుత్వాల చెల్లింపులతో సంబంధం లేకుండా బోధన రుసుములు చెల్లించాలని పట్టుబడుతున్నాయి.
ఇవీ చూడండి