చూశారుగా ఈ యువకుల వికృత చేష్టలు. రహదారిపై ప్రమాదకరంగా ఎలాంటి విన్యాసాలు చేస్తున్నారో. విజయవాడలోని విశాలమైన రహదారులపై ఇటీవల యువకుల హడావుడి మరీ ఎక్కువైంది. వాహనదారులను భయపెట్టే విధంగా ఖరీదైన బైక్‌లతో వీరు చేసే వింత చేష్టలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి ప్రమాదవశాత్తు వీరు పడిపోవడమే కాకుండా.... పక్కన వచ్చే వాహనాలను ఢీకొట్టి వారి ప్రాణాల మీదకు తెస్తున్నారు.
విజయవాడ ఫకీర్‌గూడేనికి చెందిన ఖాజా... స్టంట్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఇలాంటి విన్యాసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఇలా బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. మరో యువకుడు మల్లికార్జునకు పోలీసులు గతంలోనే కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీపై ప్రమాదకరంగా వాహనం నడుపుతున్న యువకుడు తాడేపల్లి వాసిగా గుర్తించారు. వీరందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనర్ తెలిపారు.
సినిమాల ప్రభావంతో పాటు సామాజిక మాధ్యమాల్లో లైక్‌ల కోసమే యువకులు ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఒకరిని చూసి మరొకరు స్థోమత లేకున్నా తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి లక్షలు వెచ్చించి మరీ స్పోర్ట్స్ బైక్‌లు కొనుగోలు చేస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు, కనకదుర్గ పైవంతెన, హైటెన్షన్ రోడ్డు, బెంజిసర్కిల్ పైవంతెన, ప్రకాశం బ్యారేజీపై అర్థరాత్రి వేళల్లో బైక్ రేసులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా విన్యాసాలు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని విజయవాడ పోలీసు కమిషనర్ హెచ్చరించారు.
ఇవీచదవండి.