జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య...పెద్దపూడి క్రాస్‌రోడ్డు వద్ద కలిశారు. తుపాన్ వల్ల రైతులు చాలా దారుణంగా నష్టపోయారని ఆయన పవన్ దృష్టికి తీసుకొచ్చారు.
వైకాపా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని రెడ్డయ్య పవన్‌కు తెలిపారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాల నమోదు అంతా తప్పులేనని... ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుందంతా మోసమేనని, ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని పవన్ రెడ్డయ్యతో అన్నారు.
పొలాల పరిశీలన
పవన్ కల్యాణ్ పామర్రు మండలం ఉండ్రపూడి క్రాస్‌రోడ్డు వద్ద కుళ్లిపోయిన వరి పొలాలను పరిశీలించి... ఉండ్రపూడి వద్ద రైతులను పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా పరామర్శించడానికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పోరాడతామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడవద్దని తెలిపారు.
ఇదీ చదవండి: