YCP on Konaseema: అంబేడ్కర్ పేరు జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరమని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. జిల్లా ప్రజల అభీష్టం మేరకే జిల్లా పేరు మార్చడం జరిగిందని తెలిపారు. ప్రజాభీష్టం మేరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చినట్లు పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తులు అల్లర్లు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 20 మంది పోలీసులపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారని అన్నారు. ప్రైవేటు పాఠశాల బస్సును కూడా తగులబెట్టారన్నారు. పోలీసు జీపుపై కూడా రాళ్ల దాడి చేశారని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడిని హోంమంత్రి ఖండించారు.
దుష్టశక్తులు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయి
కొన్ని దుష్టశక్తులు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంబేడ్కర్ లాంటి మహానుభావుడి పేరు ఒక జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరమని తెలిపారు. మంత్రి విశ్వరూప్, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్లపై అల్లరిమూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై మంగళగిరిలో మంత్రి సురేష్ సమీక్ష నిర్వహించారు. నిజాయతీగా పని చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన సూచించారు.
మంత్రి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం: సీపీఐ కె.రామకృష్ణ
అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆందోళనకారులు తమ అభ్యర్థనను శాంతియుతంగా తెలపాలే కానీ.. ఇలా దాడులకు పాల్పడటం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: