రాజధాని నగరంగా మారిన తర్వాత అధికసంఖ్యలో రోగులు వస్తుండటంతో విజయవాడ ప్రభుత్వాసుప్రతి రోగులతో కిటకిటలాడుతోంది. సమయానికి చికిత్స అందుతున్నా... అత్యాధునిక వైద్యం మాత్రం... అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నూతన ఆసుపత్రి ప్రాంగణంలో రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేపట్టింది. 5 అంతస్తుల్లో విశాలంగా..ఆధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాలు పూర్తై ఏడాది అవుతున్నా...నేటికి పూర్తిస్థాయి పనులు పూర్తి కాలేదు.
ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తే... మరో 6నెలల సమయం పట్టేలా ఉందని రోగులు వాపోతున్నారు. గదులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. లిఫ్ట్ పనులు, అగ్నిమాపక నిరోధక వ్యవస్థ ఏర్పాటు నత్తనడకన సాగుతున్నాయని అంటున్నారు. అధునాతన యంత్ర పరికరాలు, ఇంటీరియర్ జరగాల్సి ఉందని రోగులు చెబుతుండగా... ఆసుపత్రి సిబ్బంది మాత్రం మరో రెండు నెలల్లో ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందంటున్నారు.
ఆసుపత్రికి అవసరమైన మంచాలు, స్ట్రెచర్లు, కుర్చీలు, టేబుళ్లు, బల్లలు కొనుగోలు చేశారు. రోగులకు సౌకర్యవంతంగా ఉండేలా కార్పొరేట్ ఆసుపత్రి స్థాయి మంచాలు తీసుకొచ్చారు. వీటిని రెండో అంతస్తులో ఓ మూలకు పడేశారు. దుమ్మూ- ధూళితో ఇవన్నీ తుప్పుపట్టిపోతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ లేకే నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని....మరో ఆరునెలలయినా ఆస్పత్రి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని రోగులు వాపోతున్నారు.