కొవిడ్ వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమై ఏం చేయాలో అర్థంకాని వాళ్లెందరో. ఇంటికే పరిమితమై వినోదాలు, కాలక్షేపాలు, ఆన్‌లైన్ ఆటలు, టీవీలు ఇలా ఏదో రకంగా పూట గడిపేసిన వారెందరో. కానీ విజయవాడకు చెందిన కొందరు మాత్రం ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఈ సమయాన్ని వినియోగించుకున్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే రకరకాల సర్టిఫికేట్ కోర్సులను నేర్చేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న డేటా సైన్స్, కృత్రిమ మేథ(ఏఐ), రోబోటిక్స్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ).. లాంటి కోర్సులతో పాటు వ్యవసాయం, వైద్యం, యోగ, మొక్కల పెంపకం, ఫొటోగ్రఫీ.. ఇలా ఎవరికి నచ్చిన, భవిష్యత్తులో ఉపయోగపడే కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు.
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్ సహా పలు సంస్థలు ప్రత్యేకంగా తక్కువ కాల పరిమితి గల సర్టిఫికేట్ కోర్సులను అందిస్తున్నాయి. ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, విశ్రాంతోద్యోగులు.. ఇలా అందరూ ఈ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఐబీఎం, కోర్సెరా, మైక్రోసాఫ్ట్, ఉడేమి, లింక్‌డిన్, టాటా స్టీల్, అమెజాన్ వెబ్ సర్వీస్, గూగుల్, మిచిగాన్ స్టేట్, జార్జియా టెక్, జాన్స్ హాప్కిన్స్ లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి.
విజయవాడకు చెందిన కావూరి శ్రీధర్ లాక్‌డౌన్ సమయంలో ఇప్పటివరకు 150 కోర్సులను పూర్తి చేశారు. విజయవాడలోని పి.బి.సిద్ధార్థ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఉప విభాగాధిపతిగా శ్రీధర్ పని చేస్తున్నారు. కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథ, డేటా సైన్స్, పైతాన్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అంశాలపై ఎక్కువగా కోర్సులు చేశారు. ఎథికల్ హ్యాకింగ్, చైర్ యోగా, సంతోషానికి చిట్కాలు, కెరీర్ మేనేజ్‌మెంట్ లాంటి ఆసక్తి ఉన్న అంశాల్లోనూ నైపుణ్యం సంపాదించారు. గత మార్చి నుంచి అక్టోబర్ వరకు ఈ ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేశారు. శ్రీధర్ తానే కాకుండా, తన విద్యార్థులు, సహోధ్యాపకులతో కలిసి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 1957 కోర్సులు పూర్తి చేయించడంతో కోర్సెరా ఇండియా నుంచి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్ పురస్కారాన్ని అందుకున్నారు.
కరోనా సమయంలో ఇంటి దగ్గరే ఉండడంతో విజయవాడకు చెందిన మేనేజ్‌మెంట్ విద్యార్థి గంధం సాయి కృష్ణ 60 రకాల నైపుణ్య కోర్సులను పూర్తి చేసి ధ్రువపత్రాలు పొందాడు. తన చదువుకు అనుబంధంగా ఉండేవాటితో పాటు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లోనూ కోర్సులు చేశాడు. ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్, ఆర్ట్‌కు సంబంధించిన కోర్సులు చేశాడు. తన చదువుకు అనుబంధంగా కామర్స్‌కు సంబంధించిన కోర్సులు పూర్తి చేశాడు. లాక్‌డౌన్ సమయంలో ఐఐటీ గౌహతి, ఐఐఏం రోహతక్, ఐఐటీ మద్రాస్ లాంటి విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లో అందించిన నైపుణ్య కోర్సులు నేర్చుకున్నాడు. వీటికితోడు ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ 10 కోర్సులైన.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి వాటిపై కోర్సులు చేశాడు. భవిష్యత్తులో తనకు అవసరమయ్యే అన్ని రకాల నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నించినట్టు సాయికృష్ణ తెలిపారు.
నగరానికి చెందిన డిగ్రీ విద్యార్థిని నూకల గాయత్రీదేవి కరోనా సమయంలో 15 కోర్సులను పూర్తి చేసింది. మైక్రోసాఫ్ట్ టెక్నోలాజికల్‌కు చెందిన పైథాన్, ఖరగ్‌పూర్ ఎన్‌ఐఐటీ అందించిన సీ ప్రోగ్రామింగ్, నాస్‌కామ్‌కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐబీఎం సంస్థ నుంచి అప్లైడ్ డేటా సైన్స్‌తో పాటూ కమ్యూనికేషన్ స్కిల్స్, డేటా అనాలటిక్స్ సహా పలు కోర్సులను చేసింది. తాను భవిష్యత్‌లో డేటా అనలిస్ట్‌గా మారాలనుకుంటున్నాని, అందుకే దానికి అనుబంధంగా ఉండే సాంకేతిక కోర్సులన్నింటిపైనా దృష్టిసారించినట్టు గాయత్రీదేవి తెలిపింది.
నగరానికి చెందిన పి.అజయ్‌కుమార్‌కు ఫొటోగ్రఫీ అంటే చాలా ఆసక్తి. ఎక్కడికి వెళ్లినా.. వెంట కెమెరా ఉంటుంది. ప్రకృతికి సంబంధించిన ఫొటోలను తీయడమంటే ఇష్టం. లాక్‌డౌన్ సమయంలో తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీకి సంబంధించి అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేశారు. స్మార్ట్‌ఫోన్ నుంచి డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా వరకూ పూర్తిగా ఐదు మాడ్యూల్స్‌ను నేర్చుకున్నారు. బేసిక్ ఫొటోగ్రఫీ, కెమెరా కంట్రోల్, డిజిటల్ ఇమేజ్ పోస్ట్ ప్రొడక్షన్, ఫొటోగ్రఫీ టెక్నిక్స్.. ఇలా ఐదు రకాల సర్టిఫికేట్ కోర్సులను మూడు నెలల వ్యవధిలో పూర్తి చేశారు.
వారం రోజుల నుంచి.. నాలుగు వారాల నిడివి గల కోర్సులను ఈ సంస్థలు అందిస్తున్నాయి. వాటిని పూర్తిగా ఒక్క రోజులో పూర్తి చేస్తామన్నా.. అవకాశం ఇస్తారు. విజయవాడ నగరంలోని కొన్ని కళాశాలలు కూడా తమ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ కోర్సులను అందించే పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకుని.. ప్రస్తుతం ఈ నైపుణ్య కోర్సులను చేయిస్తున్నాయి.
ఇదీ చదవండి: సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు