విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్నును సవరిస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. నివాస భవనాలకు 0.13 శాతం, నివాసేతర భవనాలకు 0.30 శాతం, ఖాళీ స్థలాలపై 0.50 శాతం మేర ఆస్తి పన్ను విధించనున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖాళీస్థలాలపై ఆపరాధ రుసుముగా 0.25 శాతం, 375 చదరపు అడుగులలోపు ఉన్న నిర్మాణాల్లో స్వయంగా నివసిస్తే 50 రూపాయల ఇంటి పన్ను విధించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మూలధన విలువల ఆధారంగా ఆస్తిపన్ను విధించేందుకు కౌన్సిల్లో తీర్మానం చేసినట్టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ప్రతిపాదిత పన్నులకు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించినట్టు వెల్లడించింది. మొత్తం 30 రోజుల గడువులో 3,085 అభ్యంతరాలు దాఖలయ్యాయని వాటిపై కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అనంతరం ఆస్తిపన్ను రేటును సవరిస్తూ తీర్మానం చేసినట్టు వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 197ఏ, 198, 199 ప్రకారం ఆస్తిపన్ను సవరిస్తున్నట్టు వీఎంసీ తెలిపింది. 2021 ఏప్రిల్ 1 తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ఇదీ చదవండీ.. నూతన రైలు మార్గాలకు భూసేకరణపై కేంద్రం సమీక్ష.. గడువు కోరిన సీఎస్