భక్తుల పాలిట కొంగుబంగారమైన విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఏటా ఆషాఢ, శ్రావణ మాసాల్లో నిర్వహించే సారె సమర్పణ, శాకంబరీ, శ్రావణ మాసోత్సవాలను ఈసారీ యథావిధిగా జరిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నెల రోజులుగా కరోనా ఉద్ధృతి తగ్గడం, ఆంక్షల సడలింపుతో భక్తుల రాక పెరిగింది. ఉత్సవాల నిర్వహణపై పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగనందున పూర్తి జాగ్రత్తలతో భక్తులకు తగిన సౌకర్యాల కల్పనకు నిర్ణయించారు.
దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణకు భక్తులు పేర్లు నమోదు చేసుకుంటే వారికి సమయం కేటాయిస్తామని ఈవో భ్రమరాంబ తెలిపారు. దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు పాలకమండలి తొలి సారెను శాస్త్రోక్తంగా అమ్మవారికి సమర్పించనున్నారు. ఈ నెల 22 నుంచి 24వరకూ జరగనున్న శాకంబరీ ఉత్సవాలకు కూరగాయలు, పండ్ల సేకరణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు.
కరోనా ఆంక్షల సడలింపుతో ఈ నెల 8 నుంచి సాధారణ రోజుల మాదిరిగానే ఆలయ దర్శన సమయం ఉండనుంది. రాత్రి 8 గంటల వరకూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. ఆగస్టు 9 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్నందున కుంకుమ పూజల నిర్వహణకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: