విజయవాడ దుర్గగుడిలో జరిగే అవకతవకలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినప్పుడు విజిలెన్స్, ఏసీబీ లాంటి విభాగాల సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు చేస్తుంటారు. అనేక అక్రమాలను గుర్తిస్తుంటారు. ఏయే విభాగాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు? అమ్మవారి ఆదాయం ఎలా పక్కదారి పడుతోంది, బాధ్యులు ఎవరనే వివరాలన్నింటితో నివేదికలు రూపొందించి దేవాదాయ శాఖకు ఇస్తుంటారు. వాటి ఆధారంగా వెంటనే కొంతమంది సిబ్బందిపై అధికారులు చర్యలు చేపడతారు.
దుర్గగుడిలో జరిగే అవకతవకలన్నింటినీ అరికడతామని, మొత్తం ప్రక్షాళన చేసేస్తామన్నట్టుగా కొద్దిరోజులు హడావుడి చేస్తారు. అంతే ఆ తర్వాత ఆ విషయాన్ని అందరూ మరచిపోతారు. సరిగ్గా ఓ మూడు నాలుగు నెలల తర్వాత.. సదరు సిబ్బంది రాజకీయ, అధికార పలుకుబడిని ఉపయోగించి సిఫార్సులతో విధుల్లోకి చేరిపోతారు. మళ్లీ పాత పంథాలోనే అక్రమాలు కొనసాగుతుంటాయి. ఫలితంగా.. దుర్గగుడిలో ఎంత పెద్దస్థాయిలో అక్రమాలు జరిగినా తాత్కాలిక హడావుడి, కంటితుడుపు చర్యలే తప్ప.. ప్రక్షాళన మాత్రం జరగడం లేదన్న విమర్శలున్నాయి.
కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న వెండి రథం సింహం బొమ్మలను చోరీ చేసిన ఘటనలోనూ ఒక్కరంటే ఒక్కరిపైనా చర్యలు లేవు. ఘటన జరిగినప్పుడు మాత్రం బాధ్యులైన వారందరిపై చర్యలుంటాయని ప్రకటించారు. వెండి రథం పర్యవేక్షణ చూడాల్సిన సిబ్బంది చాలా మందే ఉన్నా ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు.
దేవాదాయశాఖ చరిత్రలోనే ఏ ఆలయంలోనూ జరగనంత పెద్దఎత్తున విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఫిబ్రవరి నెలలో వరుసగా నాలుగు రోజులు ఏసీబీ అధికారుల బృందం వచ్చి దుర్గగుడిలోని అన్ని విభాగాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. పరిపాలన విభాగం, స్టోర్స్, చీరలు, ప్రసాదాల తయారీ, అన్నదానం, టిక్కెట్లు.. ఇలా ప్రతి విభాగానికి సంబంధించిన దస్త్రాలను లోతుగా పరిశీలించారు. చీరల విభాగం, అన్నదానం, సరకుల కొనుగోళ్లు, ప్రసాదాల తయారీ.. ఇలా చాలా విభాగాల్లో అవకతవకలను గుర్తించారు.
వాటన్నింటికి సంబంధించిన నివేదికను తయారు చేసి దేవాదాయశాఖకు అందించారు. ఏసీబీ నివేదిక ఆధారంగా 15 మంది బాధ్యులైన సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు దేవాదాయశాఖ కమిషనర్ అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేశారు. కానీ సరిగ్గా నాలుగు నెలలు గడిచేసరికి సస్పెండ్ అయిన సిబ్బంది మొత్తం వచ్చి మళ్లీ కొలువుల్లోకి చేరిపోయారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈమాత్రం దానికి.. ఏసీబీ అధికారులు అంత హడావుడి చేస్తూ ఎందుకు సోదాలు చేయడం, నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వడం అనేది ప్రశ్నార్థకంగా మారింది.
దేవస్థానంలోని చీరల కౌంటర్‌లో రూ.70లక్షలకు పైగా పక్కదారి పట్టినట్టు గత ఈవో సురేష్‌బాబు హయాంలో గుర్తించారు. దానికి బాధ్యులైన సిబ్బందిపై తాత్కాలికంగా చర్యలు తీసుకుని వదిలేశారు. మళ్లీ సదరు సిబ్బంది హాయిగా విధుల్లో చేరిపోయారు. దేవస్థానానికి చెందిన ఆ డబ్బులు మాత్రం వెనక్కి రాలేదు.
గత మూడేళ్లలో ఇలాంటివి ఎన్నో...
* దేవస్థానంలో పని చేసే కొంత మంది సిబ్బంది నకిలీ స్టడీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు 2018 నుంచి ఉన్నాయి. గతంలో విజిలెన్స్ అధికారులు కూడా ఈ విషయంపై దృష్టిపెట్టి తనిఖీలు చేశారు. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. తాజాగా ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసి పోలీసులకు ఫిర్యాదు చేసి వదిలేశారు. మళ్లీ సదరు ఉద్యోగులు ఎప్పుడైనా విధుల్లో చేరే అవకాశం ఉంది.
* దుర్గగుడిలో నకిలీ దర్శనం టిక్కెట్లు విక్రయిస్తూ వన్‌టౌన్‌కు చెందిన ముగ్గురు యువకులు దొరికారు. వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికే దుర్గగుడి అధికారులు మూడు రోజులు వేచి చూశారు. ఆ తర్వాత విషయం బయటకొచ్చేయడంతో ఇక తప్పదన్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసి వదిలేశారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగాయి. దేవస్థానానికి చెందిన కొంతమంది సిబ్బందిని భక్తులే స్వయంగా పట్టుకుని తమకు పాత టిక్కెట్లు ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారంటూ ఈవోలకు ఫిర్యాదు చేసిన ఘటనలున్నాయి. టిక్కెట్ల అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై దృష్టిపెట్టి.. పోలీసులతో కలిసి చర్చిస్తే అడ్డుకట్ట వేయడం పెద్ద కష్టం కాదు.
* ఆలయంలో వందలాది మంది భక్తులు ఉన్న సమయంలో ఖరీదైన అమ్మవారి చీర మాయమైంది. దీనిపైనా కొన్నిరోజులు హడావుడిచేసి వదిలేశారు. ఇంతవరకూ బాధ్యులు ఎవరనేది గుర్తించి చర్యలు తీసుకున్నది లేదు.
* తాజాగా ఓ భక్తుడు రూ.10,116 విరాళం ఇస్తే.. కౌంటర్‌లో ఉన్న ఉద్యోగి రూ.100 నమోదు చేసి మిగతాది జేబులో వేసుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేసి వదిలేశారు. ఇలాంటివి దేవస్థానంలో చాలామందే చేస్తున్నట్టు గతం నుంచి ఆరోపణలున్నాయి.
పాతుకుపోయిన సిబ్బందే కారణం..
దేవస్థానంలోని పరిపాలన, స్టోర్స్, ప్రసాదాల తయారీ, టిక్కెట్లు, అన్నదానం, ఇంజినీరింగ్ ఈ ఆరు విభాగాలు చాలా కీలకమైనవి. అవకతవకలన్నింటికీ ఇవే ప్రధాన కేంద్రాలు. ఈ విభాగాల్లో పనిచేసే కొంత మంది సిబ్బంది దశాబ్దాలుగా ఒకేచోట ఉంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి 50 మందికి పైగా ఉద్యోగులను గుర్తించి రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. కొన్నాళ్లు అంతా బాగానే ఉంది. కానీ సరిగ్గా ఏడాది తిరిగేసరికి రాజకీయ, అధికార పలుకుబడిని ఉపయోగించి ఈ ఉద్యోగులంతా తిరిగి దుర్గగుడికి చేరుకున్నారు.
ఇదీ చదవండి:
ఏపీకి అన్యాయం జరుగుతోంది.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు సీఎం జగన్ లేఖ