కరోనా వైరస్ వ్యాప్తిని నియత్రించేందుకు విజయవాడలో పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మాస్కు లేకుండా రోడ్డుపై వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు. కొద్ది రోజులుగా పోలీసులు ఉదయం, సాయంత్రం మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా దుకాణ సముదాయాలు, రెస్టారెంట్ల యజమానులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. మాస్కు ధరించకుండా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో లోనికి అనుమతించొద్దని సూచించారు. బస్సుల్లో, ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణం చేసే వారే అధికంగా మాస్కు ధరించకుండా తిరుగుతున్నారని సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. కరోనా కేసులు ప్రస్తుతం వేగంగా పెరుగుతున్నాయని.. తప్పనిసరిగా కరోనా నిబంధనలను అందరూ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మాస్కు ధరిస్తే 14వేల మంది ప్రాణాలు సేఫ్!
మాదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా..
నగరంలో జరుగుతున్న మత్తు దందాపై పోలీసులు నిఘా పెంచారు. గత కొద్దిరోజులుగా యాంటీ డ్రగ్ ర్యాలీ, అవగాహన కార్యక్రమాలను పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అక్రమంగా గంజాయి అమ్మేవారు, వినియోగిస్తున్న వారిపై నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు.
మత్తు పదార్ధాలు విక్రయిస్తున్న పలువురిపై తాజాగా కేసులు నమోదు చేశామన్నారు. నగరంలో కొందరు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారని సీపీ అన్నారు. ఇటువంటి వాటికి పాల్పడేవారి వివరాలు తమకు తెలపాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ వ్యాపారం పేరుతో.. మోసగించి పరారైన మహిళ