ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు విజయవాడ లోని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల ఉద్యోగాలను మాత్రమే జాబ్ క్యాలండర్(Job Calendar)లో ప్రకటించటం మోసం చేయటమేనంటూ నిరుద్యోగులు ఆరోపించారు. ప్రకటించిన జాబ్ క్యాలండర్(Job Calendar) లోనూ సగం మేర ఉద్యోగాలు ఆరోగ్యశాఖకు సంబంధించినవేనని నిరుద్యోగులు విమర్శించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించటంతో నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.
గుంటూరులో...
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్(Job Calendar)పై నిరుద్యోగులు భగ్గుమన్నారు. గుంటూరులోని గ్రంథాలయ ప్రాంతీయ కార్యాలయం వద్ద నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళన విరమింపజేసేందుకు యత్నించారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన ఆందోళన చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రంథాలయం ఎదుట నిరుద్యోగులు తమ నిరసన కొనసాగించారు. ఏపీపీఎస్పీ తరపున గ్రూప్స్‌కు సంబంధించిన అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
అనంతపురంలో...
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అనంతపురం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద "అర గుండు" చేయించుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులను మోసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్(Job Calendar) విడుదల చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా.. కేవలం 10 వేల ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కడప జిల్లాలో...
బూటకపు జాబ్ కాలెండర్(Job Calendar)ను రద్దు చేసి... ముఖ్యమంత్రి మరోసారి పునరాలోచించి కొత్త జాబ్ క్యాలెండర్(Job Calendar)ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు శివ కుమార్, రాజేంద్ర కడపలో డిమాండ్ చేశారు. ఈ జాబ్ క్యాలెండర్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులు నిరాశకు గురయ్యారని ఆరోపించారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో...
నిరుద్యోగులకు సమగ్ర జాబ్ క్యాలెండర్(Job Calendar) విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ఉద్యోగుల సాధన సమితి ఆందోళన చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించిన నిరుద్యోగులు... అనంతరం ధర్నా చేపట్టారు. వీరి ఆందోళనకు డీవైఎఫ్ఐ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు నిరాశ మిగిల్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లాలో...
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్(Job Calendar)ను రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ యువతీ యువకులు కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉండగా.. కేవలం 10 వేల ఉద్యోగాలతో క్యాలెండర్ విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నెలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Minister Anil: తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారు: మంత్రి అనిల్