ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపటంపై బుధవారం ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య బుధవారం జరగాల్సిన సమావేశం రద్దైంది. ఈ విషయంపై ఇప్పటికే విజయవాడలో ప్రాథమికంగా ఓ దఫా చర్చలు జరిగాయి. అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు చేసేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ప్రాథమికంగా అంగీకారం కుదిరింది. కిలోమీటర్ల ప్రాతిపదికగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపేందుకు అంగీకరించారు.
కరోనాతో వాయిదా
దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో చర్చించడం, విధి విధానాలు రూపకల్పన సహా పరస్పరం ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. దీనికోసం బుధవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో టీఎస్ఆర్టీసీ, ఎపీఎస్ఆర్టీసీ అధికారులు మరోసారి చర్చించాల్సి ఉంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కార్యాలయంలో కరోనా కేసులు నమోదు కావటం, అక్కడి సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తుండటంతో సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులకు.. టీఎస్ఆర్టీసీ అధికారులు సమాచారం అందించారు. తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహించేది చర్చించి తెలియజేస్తామని అధికారులు తెలిపారు.