విజయవాడ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బెంజి సర్కిల్ పైవంతెనపై అధికారికంగా ట్రయల్ రన్ ప్రారంభించారు. కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ట్రయల్ రన్ నిర్వహించి వంతెనపైకి వాహనాలను అనుమతించారు. రూ.80 కోట్లతో 2017లో ప్రారంభమైన వంతెన నిర్మాణం 2.3 కిలోమీటర్ల మేర పూర్తై అందుబాటులోకి వచ్చింది. కొన్ని రోజుల పాటు పైవంతెన మీద వాహనాల రాకపోకలు పరిశీలించిన తర్వాత లోటుపాట్లు సరిచేసి.. మార్చిలో అధికారికంగా పైవంతెనను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని నోవాటెల్ హోటల్ నుంచి రామలింగేశ్వరనగర్ స్క్రూ బ్రిడ్జి వరకు ఒకవైపు పూర్తైన ఈ వంతెనతో.... ఏలూరు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పనున్నాయి. 7 నుంచి 8 నెలలుగా జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులతో నిత్యం చర్చలు జరిపి త్వరితగతిన పైవంతెన పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. పైవంతెనకు రెండు వైపులా వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులకు సూచించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: