రబీలో (2019-20) రూ.లక్ష లోపు పంటరుణాలు తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.128.47 కోట్లు మంగళవారం జమ కానున్నాయి. క్యాంపు కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. రబీ 2019కి సంబంధించి మొత్తం 6,27,906 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈ-పంటలో నమోదు చేసుకున్న రైతులకే పథకాన్ని వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అందులో 2,50,550 మంది పేర్లే నమోదయ్యాయి. దీంతో మిగిలిన రైతుల్లో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ రాయితీ చెల్లించనున్నారు.
‘2014-15 నుంచి 2018-19 వరకు వడ్డీ రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లనూ విడుదల చేస్తున్నాం. ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్లు చెల్లించాం. ఖరీఫ్ 2019 పంట కాలానికి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమ చేశాం. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు మొత్తంగా రూ.61,400 కోట్ల సాయం అందించాం. అర్హులైన రైతులందరికీ ఉదారంగా పథకాన్ని వర్తింపజేస్తున్నాం’ అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల పథకం కింద ప్రభుత్వం రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని గతేడాది అందించింది.
ఇదీ చూడండి: