రైతు ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ(NCRB) నివేదికలోని అంకెలు తప్పని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. 2020 ఏడాదిలో రాష్ట్రంలో కేవలం 225 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. 889 మంది రైతులు చనిపోయినట్లు ఎన్సీఆర్బీ నివేదికలో తెలపడం సరైంది కాదన్నారు.
రైతుల చావులకు నిర్దిష్ట కారణాలేమిటనే విషయాన్ని ఎన్సీఆర్బీ చెప్పలేదని, కేవలం పోలీసుల నివేదిక ప్రకారం దీన్ని వెల్లడించారన్నారు. ఎన్సీఆర్బీ నివేదికకు రాష్ట్రం ఇచ్చే రిపోర్టుకు మధ్య తేడా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం ఇచ్చే నివేదికనే పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానిది మూడో స్థానమని పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని మంత్రి ఖండించారు.
రాజధాని రైతులు "న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు" అంటూ పాదయాత్ర చేసి పవిత్ర వ్యవస్థను దిగజార్చవద్దని సూచించారు. మూడు రాజధానులకు వ్యతిరేక యాత్ర అని పెట్టుకోవాలని సూచించారు. బూతులపై చంద్రబాబుతో చర్చకు తాము సిద్దమని అన్నారు. చర్చకు ఏ వేదిక వద్దకు, ఎవరు రావాలో చంద్రబాబు చెప్పాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో గంజాయి సాగు లేదని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. రాష్ట్రంలో ఎవరైనా గంజాయి సాగు చేస్తే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు. గంజాయి సాగు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలిపెట్టే ప్రసక్తే లేదు.
ఇదీ చదవండి: TDP Leade Brahmam Case: మంగళగిరి కోర్టు వివరణపై హైకోర్టు అసంతృప్తి.. జిల్లా జడ్జికి ఆదేశాలు