TDP Politburo On Committee On Youth Participation in the Party: జగన్ రెడ్డి డర్టీ గ్యాంగ్ వల్ల మహిళా భద్రత ప్రమాదంలో ఉందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని, అతణ్ణి తక్షణమే డిస్మిస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు వైకాపా నేత ఫోన్ చేసి బెదిరించటాన్ని పొలిట్‌బ్యూరో సభ్యులు తీవ్రంగా ఖండించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15న ప్రతి గ్రామం నుంచి నియోజకవర్గ కేంద్రానికి బైక్ ర్యాలీగా వెళ్లి స్వాతంత్య్ర వేడుకలు జరపాలని తీర్మానించింది. గుంటూరులో ఆగస్టు 15న పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సభ నిర్వహించాలని పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ అసమర్థ విధానాలపై మండిపడ్డ పొలిట్ బ్యూరో సభ్యులు.. వరద ముంపు బాధితుల్ని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పాఠశాలల విలీనం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు, సామాన్యులకు విద్యావకాశాల్ని దూరం చేసిందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు యువతకు భాగస్వామ్యంపై కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి దేశాన్ని 4వ స్థానంలో నిలిపిన క్రీడాకారులను తెదేపా అభినందనలు తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారని పార్టీ నేతలు కొనియాడారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తి చేసిన సందర్భంగా పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. బీసీ జనగణన చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని సమావేశంలో తీర్మానం చేశారు.
ఇవీ చూడండి