నిర్మాణం పూర్తయిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని తెదేపా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా ప్లకార్డులు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ కాలినడకన వెళ్లారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే అంశంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో 20లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామన్న నేతలు... వాటిల్లో 90 శాతం మేర టిడ్కో ఇళ్లు పూర్తిచేశామని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా పేదలకు వాటిని స్వాధీనం చేయకుండా ప్రతినెలా అద్దె భారం మోపారని నిమ్మల దుయ్యబట్టారు. తెదేపా పిలుపునిచ్చిన 'నా ఇల్లు- నా సొంతం' కార్యక్రమంతోనే ప్రభుత్వంలో స్పందన వచ్చిందన్నారు. పేదల ఇళ్లకు సంబంధించి పాత బకాయిలన్నీ చెల్లించి లబ్ధిదారులకు వెంటనే వాటిని అందచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇళ్లన్నీ ఉచితమేనన్న జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు.
రూపాయి కూడా రైతులకు బీమా సొమ్ము చెల్లించలేదు
తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు.. బీమా సంస్థలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించని కారణంగా ఒక్కపైసా సొమ్ము అందలేదని రామానాయుడు విమర్శించారు. ఈ విషయం.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లోక్‌సభలో వివిధ రాష్ట్రాలు క్లెయిమ్ చేసుకున్న వివరాలను బయటపెట్టడం ద్వారా రుజువయ్యిందన్నారు. పంటల బీమా ప్రీమియం 1,033కోట్ల రూపాయలు చెల్లించామని సోమవారం సభలో మంత్రి కన్నబాబు మాట్లాడారన్న రామానాయుడు.... చెల్లించలేదనే ఆధారాలు తాను చూపుతుంటే అకారణంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఆయనకు మైక్ ఇవ్వలేదని విమర్శించారు. ఏడాదిన్నరగా 7 విపత్తులు పంటలను తీవ్రంగా దెబ్బతీస్తే... రూపాయి కూడా బీమా సొమ్ము చెల్లించకుండా జగన్ రైతులను నిట్టనిలువునా ముంచారని ధ్వజమెత్తారు. గత రాత్రి ప్రభుత్వం విడుదల చేసిన ప్రీమియం చెల్లింపు ఉత్తర్వులు ఇప్పుడు పంట నష్టాలకు ఎలా వర్తిస్తుందని నిలదీశారు. సభను తప్పుదోవ పట్టించిన మంత్రి కన్నబాబుపై ప్రివిలేజ్ నోటీసు ఇస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: