నంద్యాల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా స్పందించింది. వాస్తవానికి.. ఊహలకు.. భిన్నంగా కనిపించేసరికి సీఎం భాష మారిందమని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. తన అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు భాషలో స్వరం పెంచుతున్నారని పయ్యావుల కేశవ్ విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పీకుడు భాష మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో ఒక్క పనైనా సక్రమంగా చేశారా అని సూటిగా అడిగిన పయ్యావుల.. ప్రజల జీవితాల్లో వెలుగులు పీకడమా మీరు చేసింది? అని నిలదీశారు. భాష మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని పీకేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
వైకాపాలో అవినీతి అనకొండలు : రాయలసీమలో ఎంతమంది మంత్రులను పీకుతారో అని తెదేపా నేత బొండా ఉమా ఎద్దేవా చేశారు. మంత్రిగా పెద్దిరెడ్డి అక్రమార్జన రూ.6,889 కోట్లుగా పేర్కొన్న బొండా.. ఆయన అక్రమాలంటూ ఓ జాబితా విడుదల చేశారు. జే-గ్యాంగ్‌లో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామి అని.. జగన్ లావాదేవీలను దగ్గరుండి చూసే కీలక వ్యక్తి అని బొండా ఉమా పేర్కొన్నారు.
"శివశక్తి డెయిరీ ద్వారా పాడి రైతుల పొట్ట కొట్టారు. పెద్దిరెడ్డి మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాగా ఏర్పడి దోపిడీకి పాల్పడ్డారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ భూదోపిడీకి అడ్డ పెద్దిరెడ్డే. ఒక్క ఎర్రచందనం స్మగ్లింగ్‌తోనే రూ.1,800 కోట్లు వెనకేశారు. వైకాపాలో అవినీతి అనకొండలు ఎక్కువయ్యారు. మంత్రుల అవినీతిపై సీఎం జగన్ విచారణ వేయాలి. సీబీఐ విచారణ చేస్తే రాజీనామా చేసిన మంత్రులంతా జైలుకు వెళ్లడం ఖాయం. ఈ స్థాయిలో దోపిడీ చేసిన పెద్దిరెఢ్డిని కేబినెట్‌లో కొనసాగిస్తారా?" అని బొండా ఉమా ప్రశ్నించారు.
ఎన్సీసీ విషయంలో మా వైఖరికి కట్టుబడి ఉన్నా: విశాఖ మధురవాడలో కోట్ల విలువైన భూమిని ఎన్సీసీకి ప్రభుత్వం చౌకగా కట్టబెట్టిందని.. ఎన్సీసీ విషయంలో మా వైఖరికి కట్టుబడి ఉన్నానని తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన జీవోలు చదవండి అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించిన బండారు.. దీనిపై వెంకటేశ్వరస్వామి ముందు ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరెంటు తీస్తున్న జగన్‌ను.. జనం తీసేయబోతున్నారు : చంద్రబాబు