TDP leaders New Year Wishes: రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, ఇతర పార్టీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనుభవాలను, భవిష్యత్ ఏడాదికి పునాదులుగా మలచుకోవాలి: చంద్రబాబు
నూతన సంవత్సరం ఆనందోత్సాహాలతో గడవాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంటా సంతోషం, చిరునవ్వులు విరియాలి కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. వేడుకలు జరుపుకోవాలని సూచించారు. గడచిన సంవత్సరంలోని అనుభవాలను, భవిష్యత్ ఏడాదికి పునాదులుగా మలచుకుని ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో మహోన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలు మరిన్ని విజయాలు సాధించి ప్రపంచంలోనే అత్యుత్తమ శిఖరాలకు ఎదిగి వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు విలసిల్లాలని ఆకాంక్షించారు.
పోరాటం నేర్పిన సంవత్సరం వీడ్కోలు తీసుకోనుంది: నారా లోకేష్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021వ సంవత్సరం కరోనా కష్టాలు, వరదల కన్నీళ్లు మిగిల్చిందని.. అలుపెరుగని పోరాటం నేర్పిన ఈ సంవత్సరం వీడ్కోలు తీసుకుందని అన్నారు. ఆశయాల సాధనకు అవకాశాలు మోసుకొస్తోన్న నూతన సంవత్సరం 2022కి శుభస్వాగతం పలుకుదామన్నారు. ఎన్నుకున్న రంగాలలో ప్రజలకు నవవసంతం విజయాలు అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో ఉన్నతస్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.
తెలుగువారందరికీ "అఖండ" విజయం చేకూరాలి: నందమూరి బాలకృష్ణ
నూతన సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ అఖండ విజయం చేకూర్చాలని.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం రైతులు, కార్మికులు, మహిళల జీవితాల్లో ఆనందం నింపాలని.. యువత ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, దేశంలోనే అగ్రపథంలో నిలవాలన్నారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని.. యువత ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు, కలలు నెరవేర్చుకోవాలన్నారు.
కొత్త ఏడాదిలో ఆనందకరమైన జీవితాన్ని ప్రారంభించాలి: అచ్చెన్నాయుడు
రాష్ట్ర ప్రజలందరికీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బాధలు, కష్టాలు తొలగిపోయి.. కొత్త ఏడాదిలో ఆనందకరమైన జీవితాన్ని ప్రజలు ప్రారంభించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాదైనా రాష్ట్రంలో ప్రభుత్వ లూఠీని ఆపాలని కోరారు. ప్రజాసంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలబడి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించి ప్రజలు కొత్త సంవత్సర వేడుకులు నిర్వహించుకోవాలన్నారు.
ఇదీ చదవండి:
New Year Wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు