Suryalanka Beach Near AP Capital Amaravati: రాజధాని అమరావతికి కేవలం 70 నుంచి 80 కిలో మీటర్ల దూరంలోనే అద్భుతమైన బీచ్ ఉంది. అదే సూర్యలంక బీచ్. ఇక్కడకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా వస్తూ ఉంటారు. సుమారు 4 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ సహజ సిద్ధమైన బీచ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అయితే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారు సముద్రంలో స్నానాలు చేసిన తరువాత శుభ్రం చేసుకోవడానికి మంచినీటి పంపులు, దుస్తులు మార్చుకోవడానికి గదులు లేవు. ఆ తడిసిన దుస్తులతోనే అసౌకర్యంగా తమ ఇళ్లకు తిరుగుముఖం పట్టేవారు. ఈ విషయాలు బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి జిల్లా గ్రాంటు నుంచి 40 లక్షల రూపాయలు వెచ్చించి పలు సౌకర్యాలను కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సూర్యలంక బీచ్‌కు మరింతగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది.
అమరావతికి దగ్గరలో ఉన్న ఏకైక బీచ్: రాజధాని అమరావతికి కేవలం 70 నుంచి 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏకైక బీచ్ ఇదే. ఇప్పటివరకూ ఇక్కడకు వచ్చే పర్యాటకులకు డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ లేవు. దీంతో యుద్ధప్రాతిపదికన ఆయా వసతుల కల్పనకు కలెక్టర్ ఆదేశించారు. రానున్న రోజుల్లో సూర్యలంక బీచ్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ సౌకర్యాల నిర్వహణ బాధ్యతలను స్థానిక పంచాయతీకి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు బాపట్ల కలెక్టర్ వెంకట మురళి తెలిపారు.
కొత్తగా వస్తున్న సౌకర్యాలు ఇవీ:
- కేవలం నెల రోజుల్లోనే డ్రెస్సింగ్ రూమ్స్, మంచినీటి పంపుల ఏర్పాటు, టాయిలెట్స్ నిర్మాణం చేపట్టే బాధ్యతను జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించారు.
- సూర్యలంక బీచ్ నుంచి రెండు, మూడు కిలో మీటర్ల దూరంలో మంచినీళ్లు పడే ప్రాంతాలను గ్రామీణ నీటి సరఫరా విభాగం గుర్తించింది. ఇక్కడ బోర్లు వేసి పైపులైన్ ద్వారా బీచ్‌కు నీళ్లు చేర్చేలా ప్లాన్ రూపొందించారు.
- బీచ్‌లో 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మిస్తున్నారు. అందులోకి నీళ్లు తరలించి పర్యాటకులు స్నానాలు చేసేందుకు అందుబాటులో తీసుకొస్తున్నారు.
- రోజుకు కనీసం 3 నుంచి 4 వేల మందికి పైగా వస్తారని అంచనాతో 80 వరకు ఓపెన్ షవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- షవర్ల కింద స్నానం చేయడానికి ఇష్టపడని వారి కోసం క్లోజ్డ్ బాత్రూమ్లను సుమరు 20 వరకు నిర్మించాలని నిర్ణయించారు.
- దుస్తులు మార్చుకునేందుకు వీలుగా 30 రూమ్‌లు ఏర్పాటు చేయబోతున్నారు.
- స్వచ్ఛాంధ్ర నిధుల కింద మరో 20 వరకు మరుగుదొడ్లు నిర్మించడానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది.
సూర్యలంక బీచ్‌కు మహర్దశ - రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం - Suryalanka Beach Development
'వంద రోజుల్లో వంద కోట్లు' - సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక - SURYALANKA BEACH