TDP leaders meet governor: మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలోని తెదేపా నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలని నేతలు కోరారు. ఏజెన్సీలో ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలకు పాల్పడ్డారని..,ఆయన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని అన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటివరకు కనీస విచారణ చేయలేదని.., కేసు వీగిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
రిమాండ్ పొడిగింపు: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను ఈనెల 20 వరకు పొడిగించారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడు. ఇవాళ కోర్టులో అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణకు రాగా.. విచారణను ఈ నెల 9కి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ జరిగింది: మే 19న కాకినాడ కొండయ్యపాలెంలో స్నేహితులతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యంను తన కారులో ఎక్కించుకుని ఎమ్మెల్సీ అనంతబాబు వెళ్లారు. గతంలో ఆయన దగ్గరే డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడే పనుందంటూ తీసుకెళ్లారు. అర్థరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు అనంతబాబు ఫోన్ చేసి.. నాగమల్లితోట వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు వారిని అక్కడికి రమ్మని పిలిచాడు. మళ్లీ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో తన కారులోనే వెనకసీటులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు కాపలాగా ఉండే అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చారు. సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఎమ్మెల్సీ చెప్పడంపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరుకారుతూ, ఇసుక ఎలా ఉందని నిలదీశారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఉదయభాస్కరే తన భర్తను చంపేశాడన్న అనుమాన్ని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వ్యక్తం చేశారు. పైగా నాగమల్లితోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పిన మాటలు అబద్దమనే తేలాయి. అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలింది.
సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు.. వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అంగీకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ మేరకు మే 23న ఎమ్మెల్సీని అరెస్ట్ చేసిన పోలీసులు.. జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి తొలుత 14 రోజుల రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. హత్య ఘటనపై డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగింటినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడి కోసం ఆరు బృందాలతో గాలించి నిందితుడు అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతబాబును విచారించి వాంగ్మూలం నమోదు చేశామన్నారు.
ఇవీ చూడండి