జగన్ పాలనలో సొంత పార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండా పోయిందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా కార్యకర్త అక్బర్ బాషా(ycp cadre akbar basha) పొలాన్ని.. వైకాపా నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి కబ్జా చేశారు. దీనిపై నిలిదీసిన బాధితుడిని.. మైదుకూరు సీఐ కొండారెడ్డి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరింపులకు దిగారని స్వయంగా వైకాపా కార్యకర్తే కన్నీళ్లు పెట్టుకున్నాడని.. లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో సొంత పార్టీ వారికే రక్షణ లేకుండాపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి
ముస్లిం మైనార్టీలపై ప్రభుత్వ పెద్దల అండతో దాడులు జరుతున్నాయని.. తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఆరోపించారు. కడప జిల్లా వైకాపా కార్యకర్త అక్బర్ బాషా కుటుంబంపై.. ఆ పార్టీ మండల నాయకులు నిర్ధాక్షిణ్యంగా దాడి చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ రెడ్డి బంధువు తిరుపాల్ రెడ్డి.. తన పొలం అక్రమించుకున్నాడని ఫిర్యాదు చేస్తే, మైదుకూరు సీఐ కొండారెడ్డి బెదిరించడం దారుణమన్నారు. అన్యాయం జరిగిన ప్రతి ముస్లిం కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని నాగుల్‌మీరా హామీ ఇచ్చారు.
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యమా..?
మైనార్టీ కుటుంబానికి చెందిన అక్బర్ బాషాను బెదిరించిన సీఐను విధుల నుంచి తొలగించి.. కేసు నమోదు చేయాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారుక్‌సుబ్లి డిమాండ్ చేశారు. కోర్టులు తేల్చాల్సిన సివిల్ వివాదాల్లో.. పోలీసులు జోక్యం చేసుకోనే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. పోలీసులు వైకాపా నాయకులకు తొత్తులుగా మారుతున్నారని మండిపడ్డారు. అక్బర్‌బాషా ఆవేదనకు కారణమైన వైకాపా నాయకుడు తిరుపేలరెడ్డిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతలను కాపాడాలన్నారు.
ఇదీ చదవండి:
రాయలసీమ సాగు ప్రాజక్టులకు జరిగన అన్యాయంపై నేడు చర్చించున్న తెదేపా నేతలు