TDP Fire On YCP: వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అసమర్థ పాలన సాగిస్తోందని తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ నేతలు.. ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆక్షేపించారు. గతంలో మాదిరి సీఎం జగన్ తన ప్యాలెస్‌కు పరిమితం కాకుండా.. ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. కేంద్రఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే వ్యాక్సినేషన్లో ఏపీ బాగా వెనుకబడిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెండు డోసులు కలిపి 5.60 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చారని, జనాభాలో సగభాగానికి కూడా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదన్నారు. బూస్టర్ డోసుపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచనే చేయడం లేదని పట్టాభిరామ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తక్షణమే ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
నిరూపిస్తే.. బొత్స రాజీనామా చేస్తారా ?: గోరంట్ల
వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) కోసం అధికారులు ఒత్తిడి తెస్తున్నారని నిరూపిస్తే బొత్స రాజీనామా చేస్తారా ? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. ఓటీఎస్ ద్వారా రూ.4,800 కోట్లు ప్రజల నుంచి ఎందుకు సేకరించాలనుకుంటున్నారో సమాధానం చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓటీఎస్ డబ్బు చెల్లించకపోతే..రేషన్, పెన్షన్ కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమన్న ఆయన..ఆ ప్రోగ్రాంను వెంటనే రద్దు చేయాలన్నారు. రాష్ట్రాన్ని అదానీ లాంటి వారికి తాకట్టు పెడుతున్నారని గోరంట్ల మండిపడ్డారు. చట్టసభల్లో జరిగే అనైతిక ఘటనలకు ముఖ్యమంత్రి అక్కడే క్షమాపణ చెప్పాలన్నారు.
ఉద్యోగుల సస్పెన్షన్ అనైతికం: అకోశ్ బాబు
తితిదేలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయటం దుర్మార్గమని ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలిపితే సస్పెండ్ చేస్తారా ? అని నిలదీశారు. తక్షణమే సస్పెన్షన్‌ను ఎత్తివేసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ కార్మికులను మూడు నెలల్లో రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి..ఇప్పుడు మాట తప్పారని సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తులను బోర్డు మెంబర్లుగా తీసుకోవడానికి అడ్డురాని నిబంధనలు ఉద్యోగులకు అడ్డుపడుతున్నాయా ? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి
TTD Suspended three employees: ముగ్గురు తితిదే ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు