తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. నరసరావుపేట పర్యటన నేపథ్యంలో పోలీసుల అరెస్టులను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. లోకేశ్ పర్యటనతో ముఖ్యమంత్రికి వణుకుపుడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన వారికి భరోసా కల్పించడం తప్పా? అని ప్రశ్నించిన ఆయన.. పరామర్శకు వెళ్తే ప్రభుత్వంలో ఉలుకెందుకని నిలదీశారు. నిందితుల్ని వదిలేసి.. అండగా నిలిచే తెదేపా నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
లోకేశ్ పర్యటిస్తే ఎందుకింతలా ఉలిక్కిపాటు: బీదా రవిచంద్ర
దిశాచట్టం ద్వారా ముగ్గురికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవశిక్షలు విధించామని హోంమంత్రి సుచరిత చెప్పడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర విమర్శించారు. బాధితుల కుటుంబాల పరామర్శకు నారా లోకేశ్ వెళితే ఎందుకింతలా ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఏడాదైనా.. బాధితురాలికి న్యాయం చేయలేదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. ప్రభుత్వం అసమర్థత బయటపడుతుందనే నెపంతో లోకేశ్ పర్యటనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దిశ చట్టం పేరుతో ఎన్నాళ్లు మహిళలను మభ్యపెడతారని ఆమె నిలదీశారు.
నరసరావుపేటలో ఉన్మాది చేతిలో బలైన అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేశ్ వస్తుంటే అడ్డుకోవటం, తెదేపా నేతల్ని గృహనిర్భందం చేయటం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. హత్య జరిగి సంవత్సరం గడుస్తున్నా.. ఇంతవరరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేని వైకాపా ప్రభుత్వం.. తెదేపా నేతల్ని అరెస్టు చేయటం సిగ్గుచేటన్నారు. గృహనిర్భందం చేసిన తమ నేతల్ని వెంటనే విడుదల చేసి లోకేశ్ నరసరావుపేట పర్యటనకు అనుమతివ్వాలని నేతలు డిమాండ్‌చేశారు. విజయవాడలో నాగుల్‌మీరా, ఉయ్యూరులో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ను గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరగా.. పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరును నేతలు తీవ్రంగా ఖండించారు.
ఇదీ చదవండి..
నరసరావుపేటలో నారా లోకేశ్ పర్యటనపై ఉత్కంఠ.. నేతల గృహనిర్బంధం