మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత సీఎం జగన్‌పై ఉందని తెదేపా నేత బుద్దా వెంకన్న అన్నారు. వివేకా కుమార్తె సునీతను అనుమానించేలా.. సొంత మీడియాలో కథనాలు ప్రచురించటం దారుణమన్నారు.
చెల్లెళ్లకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్‌కు మహిళా దినోత్సవం నిర్వహించే అర్హతలేదని మండిపడ్డారు. సునీతకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. జగన్ 1000 రోజుల పాలనపై ప్రజలు అసహనంగా ఉన్నారన్నారు.
వైకాపా ఓడిపోవటం ఖాయం..
వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోవటం ఖాయమని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్ ముందస్తు ఎన్నికలు వస్తాయని సంకేతాలు ఇస్తుంటే... సజ్జల మాత్రం ఎన్నికలు ముందస్తుగా రావు అంటున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపాకు 160 సీట్లు ఖాయమన్నారు. విజయవాడలో తెదేపా సెంట్రల్ నియోజకవర్గం నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి విచ్చేసిన ఉమా.. వైకాపా వెయ్యి రోజుల పాలన పై గోడపత్రికను ఆవిష్కరించారు. వైకాపా మూడేళ్ల పాలనలో వ్యాపారస్తులు, కార్మికుల జీవితాలు తలకిందులయ్యాయన్నారు.
న్యాయం జరిగే వరకు పోరాడుతాం..
చందర్లపాడు మండలం ముప్పాళ్లలో దాడికి గురైన బీసీ మహిళలు కళ్యాణదుర్గ, గంట దుర్గలను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు బాధితుల తరఫుల పోరాడుతామన్నారు.ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించి తక్షణమే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళల పట్ల సభ్యసమాజం తలదించుకునేలా దురాగతాలు చేసిన వాళ్లను ఎందుకు కాపాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీలను దారుణంగా మోసగించారు
రాష్ట్రంలో నాల్గోవంతు జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా మోసగించిందని తెదేపా పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే చెందాల్సిన వేలకోట్ల సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి తీరని ద్రోహం చేశారన్నారు. తెదేపా హయాంలో ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు అమలు చేసిన స్వయం ఉపాథి పథకాలన్నీ రద్దు చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులనే రెడ్డి, కమ్మ కార్పొరేషన్లకు మళ్లించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి గుణపాఠం చెప్పేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
ఇదీ చదవండి : రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేశారు: పట్టాభి