Varla Ramaiah: ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మార్గదర్శకత్వంలో పోలీసులు పనిచేస్తూ.. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మార్క్ నుంచి రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా బయటపడాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ యువకుడు అనంత ఉదయభాస్కర్ చేతిలో బలైపోయాడు. ఈ కేసులో పోలీసులన్నీ తప్పటడుగులే వేశారు. ఎవరిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు ? శవాన్ని పెట్టి వెళ్తే.. ఎక్కడి నుంచి తెచ్చావని ప్రశ్నించాలి. ఎమ్మెల్సీని నిలదీయాలి. కనీసం ఆయన గన్‌మెన్‌ను కూడా విచారించలేదు. సుబ్రమణ్యం శవాన్ని పోస్టుమార్టం చేసి సమాధి చేయాలనే తపన తప్ప.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆలోచన పోలీసుల్లో కనిపించలేదు. ఈ పోస్టుమార్టం ప్రక్రియనైనా వీడియో తీశారా? నిపుణుడైన వైద్యుడి ఆధ్వర్యంలో శవపరీక్ష జరిగిందా.. అప్పుడు రెవెన్యూ అధికారులు ఉన్నారా.. లేరా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ కేసులో వాస్తవాలు వెలికి తీయడంలో పోలీసు వ్యవస్థ విఫలమైంది’ అని అన్నారు.
వైకాపా హత్యాకాండ నానాటికీ పెరిగిపోతోంది.. వైకాపా నాయకుల హత్యాకాండ నానాటికీ పెరిగిపోతోందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ఓ ఎస్సీ యువకుడిని హత్య చేస్తే పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప ఏ చర్యలూ తీసుకోవడం లేదు. ఉదయభాస్కర్‌ను శాసన మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు వెనకేసుకు రావడం దారుణం’ అని పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: