డ్రగ్స్(DRUGS) దందా, మాదకద్రవ్యాలపై ప్రశ్నిస్తున్న తెలుగుదేశం నాయకులపై వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నోరు పారేసుకున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి(TDP LEADER) కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఉదయభాను రెండో కుమారుడు ప్రశాంత్ డ్రగ్స్ వ్యవహారంలో మునిగి తేలుతున్నాడని ఆరోపించారు. ప్రశాంత్ నిన్న తెలంగాణ సరిహద్దులో తన మిత్రబృందంతో కలిసి 60 కిలోల గంజాయితో పట్టుబడ్డాడని పేర్కొన్నారు. ప్రశాంత్ పట్టుబడగానే తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్ ప్రగతి భవన్‌తో మంతనాలు నడపడంతో, ప్రశాంత్‌ను తప్పించి ఇతరులను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఉదయభాను, ఆయన కుటుంబం గురించి జగయ్యపేట నియోజకవర్గ వాసులకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు.
మరోపక్క నర్సీపట్నం వైకాపా ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ ఏజెన్సీ ప్రాంతాలే కేంద్రంగా గంజాయి వ్యాపారం సాగిస్తున్నాడని ఆరోపించారు. ఉమాశంకర్ గణేశ్, ప్రముఖ చిత్రదర్శకుడు పూరీజగన్నాథ్కు స్వయంగా సోదరుడని..పూరీ కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు.
జగన్...రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్ గా మార్చాడు..
తన దోపిడీ, అక్రమార్జన, అవినీతి కోసం ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్గా మార్చాడని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత(VANGALAPUDI ANITHA) ధ్వజమెత్తారు. తన దోపిడీ కోసం ఈ ముఖ్యమంత్రి యువతను మత్తు(DRUGS)కు బానిసల్నిచేస్తున్నాడని దుయ్యబట్టారు. యువత హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు బానిసలు అవ్వబట్టే, రాష్ట్రంలో ఆడబిడ్డలు, మహిళలపై దారుణాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో పోలీసులు జగన్మోహన్ రెడ్డిని ఎలా కాపాడాలి.. ఆయన ఆస్తులను, అనుచరులను ఎలా రక్షించాలన్న అజెండాతోనే పని చేస్తున్నారని విమర్శించారు.
హెరాయిన్ గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని మాజీమంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కేంద్ర బిందువుగా వేల కోట్ల రూపాయల హెరాయిన్ దేశాలకు విదేశాలకు తరలిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో హెరాయిన్ ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీఆర్ఐకు సమాచారం ఇచ్చేంత వరకు రాష్ట్రంలో ఉన్న ఇంటిలిజెన్స్ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని నిలదీశారు.