ముఖ్యమంత్రి జగన్ అవినీతి, కుంభకోణాలు నిరూపితమైతే లక్షసార్లు జైలుకెళ్లే పరిస్థితి ఉందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. జగన్ అతని అనుచరుల అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆయన ఆక్షేపించారు. ఐటీ దాడులు జరిగాక.. అయోధ్యరామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.
"రాంకీ, కిన్నెటా, హెటిరో, అరబిందోల అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ధాన్యం బకాయిల కోసం రైతులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ప్రభుత్వంపై తిరగపడుతున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫైబర్ నెట్లో అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. తలకిందులుగా తపస్సు చేసినా..చంద్రబాబు, లోకేశ్‌లపై మచ్చ వేయటం సాధ్యం కాదు. ఫైబర్ నెట్‌పై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ..ఏడాది క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిరాధారమైన ఆరోపణలపై విచారణ అనవసరమని ఆ జీవోను సీబీఐ చెత్తబుట్టలో పడేసింది. ఏడాది నుంచి ఒక్క ఆధారరమైనా సాధించలేకపోయారు. కొండను తవ్వి ఎలుక వెంట్రుక కూడా పట్టుకోలేదు. ఫైబర్ నెట్‌పై వైకాపా నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి. అతి తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ వంటి 3 రకాల సేవల్ని ప్రజలకిచ్చిన అత్యుత్తమ ప్రాజెక్టు ఫైబర్ నెట్ అని దేశమంతా తెలుసు. రూ.770 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా గత రెండేళ్లలోనే ప్రభుత్వానికి రూ.300 కోట్ల ఆదాయం వచ్చింది. చంద్రబాబు లాంటి విజన్, ఆలోచనలు లేని జగన్‌కి తెలిసిందల్లా బాదుడే. రూ.149 కే ప్రవేశపెట్టిన ఫైబర్ నెట్‌ను రూ.300 దాటించి ప్రజలపై భారం మోపారు."- పట్టాభి, తెదేపా అధికార ప్రతినిధి
ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు మేలు చేయకపోగా..దేశానికే ఆదర్శవంతమైన ఫైబర్ ప్రాజెక్టును భ్రష్టు పట్టించారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలపై భారం మోపకుండా ఆదాయం పెంచే ఒక్క ప్రాజెక్టునైనా సీఎం జగన్ తీసుకొచ్చారా ? అని పట్టాభి నిలదీశారు.
ఇదీ చదవండి
JAGAN POLAVARAM TOUR: 2023 నాటికి ఎర్త్ కం ర్యాక్‌ఫిల్ డ్యాం పూర్తి చేయాలి: సీఎం జగన్