సీఎం జగన్, సజ్జల డైరెక్షన్లోనే పేదల ఇళ్లపై శివమురళి అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేశారని మాజీమంత్రులు జవహర్, పీతల సుజాతలు మండిపడ్డారు. విలేఖరుల సమావేశంలో జవహర్ మాట్లాడుతూ...ముఖ్యమంత్రి అనుచరుడు, వైకాపా క్రియాశీల కార్యకర్త పొదలి శివమురళిని జగన్ అప్యాయంగా ఆలింగనం చేసుకున్న చిత్రానికి సజ్జల ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సమస్యల్ని పక్కదారి పట్టించి, ప్రతిపక్షాలపై బురదచల్లటంతో సజ్జల రామకృష్ణారెడ్డి మాస్టర్స్ డిగ్రీ పొందారని విమర్శించారు. తెదేపా పేదల ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటోందంటూ అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే చిత్తశుద్ది వైకాపా ప్రభుత్వానికి ఉంటే తక్షణమే శివమురళితో కేసు ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తోంది...
కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...బిల్లుల చెల్లింపులో తమవారి సంస్థలు, వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవటంతో ఇతర అభివృద్ధి పనులకు ఎవ్వరూ ముందుకు రావట్లేదని ధ్వజమెత్తారు. అభివృద్ధిని విస్మరించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, ఇక అప్పుకూడా పుట్టని దుస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.
ఇదీ చదవండి: