పదో తరగతి పప్రశ్నపత్రాల లీక్, మాస్ కాపీయింగ్ ఘటనలతో ప్రభుత్వం నాడు-నేడుకు కొత్త నిర్వచనం చెప్పిందని మాజీమంత్రి, తెదేపా నేత జవహర్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కట్టుదిట్టంగా, క్రమశిక్షణగా పరీక్షలు నిర్వహిస్తే... ఈ ప్రభుత్వంలో వాట్సాప్ గ్రూపుల్లో పరీక్షపత్రాలు ప్రత్యక్షమవుతున్నాయని మండిపడ్డారు. తాను చదువుకునే రోజుల్లోనే మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన సీఎం.. మాస్ కాపీయింగ్ నేరంకాదన్నా ఆశ్చర్యం లేదని జవహర్ ఎద్దేవా చేశారు.
పదో తరగతి పరీక్షాపత్రాలు లీక్ కాలేదని, మాస్ కాపీయింగ్ జరగలేదని చెబుతున్న విద్యాశాఖ మంత్రి బొత్స... 12 మంది ఉపాధ్యాయులను ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలన్నారు. మంత్రి బొత్సకు ఏమాత్రం నైతికత ఉన్నా.., జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పది పరీక్షలే నిర్వహించలేని ప్రభుత్వం ఇంటర్, ఇతర పోటీ పరీక్షలను ఎలా నిర్వహిస్తుందని నిలదీశారు.
"ప్రశ్నపత్రాల లీక్, మాస్ కాపీయింగ్‌తో నాడు-నేడుకు కొత్త నిర్వచనం. నాడు కట్టుదిట్టమైతే... నేడు ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ప్రశ్నపత్రాలు లీక్ కాలేదని మంత్రి బొత్స చెబుతున్నారు. లీక్ కాకపోతే 12 మందిని ఎందుకు అరెస్టు చేశారు. పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బొత్స మంత్రి పదవికి రాజీనామా చేయాలి."- జవహర్, మాజీమంత్రి
ఇదీ చదవండి: టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ.. పోలీసుల అదుపులో ప్రధానోపాధ్యాయుడు