Devineni Uma on Polavaram: పోలవరం సందర్శనకు వెళ్లి వచ్చిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై.. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. పోలవరం సందర్శనకు వెళ్లిన మంత్రికి వాస్తవాలు ఇప్పుడే అర్థమయ్యాయా? అని నిలదీశారు. గతంలో ఎమ్మెల్యేల కమిటీలో సభ్యుడిగా ఉండి.. తెదేపా హయాంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగలేదన్న ఆయన.. 2019-20లో అది దెబ్బతిన్నదని ఎలా చెప్పారని నిలదీశారు.
రాజశేఖర్ రెడ్డి కారణంగా ప్రాజెక్ట్ నిర్మాణం 2,500కోట్ల రూపాయలు పెరిగితే, ఇప్పుడు ఆయన కుమారుడి అవినీతితో ప్రాజెక్ట్ నిర్మాణమే ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు 36 నెలల పాలనలో పోలవరం ప్రాజెక్ట్ రివ్యూ, పనుల వివరాలు ఎందుకు బయటపెట్టలేదని దేవినేని నిలదీశారు. నిర్వాసితుల సొమ్ముని వైకాపా వారే కాజేస్తున్నా.. ముఖ్యమంత్రి కానీ, ఆ శాఖ మంత్రి కానీ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ గురించి ఎవరు ఏం అడిగినా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి రెండు చేతులు పైకి ఎత్తి తనకేమీ తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి జగన్ రెడ్డి మూర్ఖపు, అహంకారపూరిత నిర్ణయాలే కారణమని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
ఇదీ చదవండి : రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజాఉద్యమం : చంద్రబాబు