తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన 'ఫోర్త్ లయన్ యాప్'ను కాపీ చేసి 'దిశా యాప్' గా సీఎం జగన్(CM JAGAN) హడావిడి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(ATCHANNAIDU) దుయ్యబట్టారు. 2015 లో ఆపత్కాలంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించేలా 'ఫోర్త్ లయన్ యాప్' రూపొందించినట్లు ఆయన తెలిపారు.
అంతా ప్రచార ఆర్భాటమే...
'ట్రాక్ మై ట్రావెల్' పేరిట ఉన్న ఫీచర్ ద్వారా ఎస్‌ఓఎస్‌ను.. ఈ యాప్లో మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా పొందుపరిచారని, యాప్ లో బటన్ నొక్కితే వెంటనే పోలీసులు అప్రమత్తమై బాధితుల వద్దకు చేరుకునే వెసులుబాటు కల్పించారన్నారు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో చెప్తే వారు ప్రయాణిస్తున్న మార్గాన్ని పోలీసు వాహనం అనుసరించే సాంకేతికతను చంద్రబాబు ఆనాడే అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. నాడు ప్రచారానికి ఇంతగా ఖర్చు చేయకపోయినా ఒక్క రోజులోనే 1.50 లక్షల మంది 'ఫోర్త్ లయన్ యాప్' ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు.
జగన్ రెడ్డికి అందుబాటులో ఉన్న చట్టాలనే సరిగా అమలు చేయడం చేతకాక, చట్ట రూపం దాల్చని దిశాపై హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేదని, ఏడాదంతా జులాయిగా తిరిగిన విద్యార్థి పరీక్షల్లో కాపీ కొట్టిన విధంగా.. జగన్ రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. న్యాయం చేయమని మహిళలు ఘోషిస్తుంటే తేలు కుట్టిన పిల్లిలాగా ఉంటున్న వాళ్లు ఎన్ని యాప్ లు తెచ్చినా ఉపయోగం లేదన్నారు.
నిందితులకు శిక్షలేవి..
రాష్ట్రంలో మహిళలలు, ఎస్సీల పై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అమెరికా మానవహక్కుల సంఘం సైతం ఆందోళన వ్యక్తంచేసిందన్నారు. సీఎం నివాసానికి సమీపంలో ఎస్సీ యువతిపై అత్యాచారం జరిగి వారంరోజులు గడిచినా.. ఇంతవరకు నిందితుల ఆనవాళ్లు కూడా కనిపెట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసులో ఏడాది గడిచినా న్యాయం జరగలేదన్నారు. నర్సరావుపేటలో విద్యార్థినిని హత్యచేసిన నిందితుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అన్నారు. మహిళలపై అత్యాచారాలు, దాడుల ఘటనల్లో ఎంతమందికి శిక్షలుపడేలా చేశారని ప్రశ్నించారు. ఇకనైనా అసత్యాలు మాని మహిళా భద్రతపై దృష్టి పెట్టకుంటే వారి చేతిలో ప్రభుత్వానికి బడితపూజ తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి: