అక్రమ అరెస్టులు, హింసతో రాష్ట్రంలోని ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రతిపక్షనేతలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్, డీజీపీలకు విడివిడిగా లేఖలు రాశారు. కొందరు పోలీసులు వైకాపా నేతలతో కుమ్మక్కై తెదేపా సానుభూతిపరుల్ని వేధించటమే పనిగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
వరుస ఘటనల్లో భాగంగా.. కడప జిల్లా చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనే తాజా ఉదాహరణని అందులో ప్రస్తావించారు. కడప డీఎస్పీ సునీల్ సనేతృత్వంలో సీఐ రాజా రెడ్డి తెదేపా నేతలు రాజు వెంకట సుబ్బారెడ్డి, పోస సునీల్, జహీర్ లను తీవ్రంగా హింసించారని మండిపడ్డారు. ఈ నెల 8న రాజు వెంకట సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ ఆదేశాల మేరకు శారీరికంగా హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు అంగీకరించాలని వారిపై ఒత్తిడి తెచ్చారన్నారు. అజ్ఞాత వ్యక్తి ఆత్మహత్యకు కారకులుగా ఒప్పుకోవాలంటూ తీవ్రంగా వేధించి హింసించారని లేఖలో ప్రస్తావించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన లేఖలకు హింస తాలుకూ ఫోటోలను అచ్చెన్నాయుడు జత చేశారు.
ఇదీ చదవండి:
VIJAYAWADA CP: రౌడీమూకలపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ శ్రీనివాసులు