శాసన మండలిలో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపకుండా అడ్డుకోవడం రాజ్యాంగ బద్ధమా అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలపై చర్చ జరగాలన్న స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై భారత న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మండలి రద్దు తీర్మానం చేసి తిరిగి అదే మండలికి సభ్యుడిని ఎలా ఎన్నుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పదవికి రాజ్యాంగం రక్షణ కోరుకోకుండా పక్కన పెట్టి సామాన్య పౌరుడిగా చర్చకు రండి... అంశాల వారీగా బహిరంగంగా చర్చిద్దాం అని స్పష్టం చేశారు.
బెదిరింపు వ్యాఖ్యలు...
సభాపతి వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా తప్పుబట్టారు. న్యాయస్థానాలను సైతం బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
శాసన సభాపతి తమ్మినేని సీతారాం న్యాయ వ్యవస్థలపై చర్చ జరగాలన్నారు. దీనిపై చర్చకు సిద్ధం. తమ్మినేనినే ముఖ్య అతిథిగా చర్చకు ఆహ్వానిస్తాం. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి న్యాయ వ్యవస్థలపై అయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు. ఈ తరహా వ్యాఖ్యలు చేయాలనుకుంటే క్యాబినేట్ హోదాలోకి వెళ్లండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగడం లేదు- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి