తెదేపా మహానాడు రెండు రోజులపాటు వినూత్నంగా సాగింది. కార్యకర్తలందరినీ జూమ్ యాప్ ద్వారా కార్యక్రమంలో పాల్గొనేలా సన్నద్ధం చేయడం, ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతవాసులూ వేడుకను తిలకించేలా ఏర్పాట్లు చేయడం వంటి వాటిపై ప్రధానంగా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. రెండు రోజుల వేడుకలో 22 తీర్మానాలను ఆమోదించగా.... 55 మంది నేతలు ఇందులో ప్రసంగించారు. ప్రతి తీర్మానంపైన ఇద్దరు, ముగ్గురు నేతలు మాట్లాడగా వాటిపై అధినేత చంద్రబాబు తన విశ్లేషణతో ఏకగ్రీవంగా ఆమోదించారు. రోజుకు ఆరేసి గంటల చొప్పున రెండు రోజులూ కలిపి దాదాపు 12 గంటల పాటు ఈ వేడుక సాగింది. ఎవరూ.. చేయని విధంగా.. డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై పసుపు జెండా ఎగిరింది.
జూమ్ యాప్‌తో పాటు పార్టీ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్‌ల్లో వీక్షకుల సంఖ్య తొలిరోజు లక్షన్నర వరకూ ఉండగా, రెండవరోజూ అదేజోరు కొనసాగింది. ఇతర సామాజిక మాధ్యమాలు, వివిధ మీడియా ఛానళ్లు, ఆయా ఛానళ్లలో వచ్చే ప్రత్యక్షప్రసారాల వీక్షణ అంతా కలిపి బహిరంగ సభ నిర్వహణలో పాల్గొనే దానికంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువమందికి సమావేశ సందేశం చేరిందన్నది పార్టీ వర్గాల అంచనా.
మహానాడు ఆహ్వానాన్ని కూడా చంద్రబాబు డిజిటల్ రూపంలోనే నాలుగురోజుల ముందుగా పంపారు. మహానాడులో పాల్గొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఇందులో సూచనలు చేశారు. ప్రతి కార్యకర్త మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌లో జూమ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పంపిన లింక్‌ను ట్యాప్ చేసి స్క్రీన్ నేమ్ వద్ద పేరు, ‘జీమెయిల్’ వద్ద mahanadu@tdp.com అని టైప్ చేసి మహానాడులో చేరేలా ఏర్పాట్లు చేశారు. సాంకేతిక సమన్వయ బాధ్యత మొత్తం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: 'మీరొదిలినట్లు నేనూ వదిలేస్తే బయటకు రాలేరు'