ఏం జరిగింది?
పీటీఐ వార్త సంస్థ కథనం ప్రకారం.. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో తాను మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు తెలిపారు. దాంతో అసెంబ్లీ నుంచి చంద్రబాబు, మిగతా తెదేపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. వెంటనే చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి మధ్యలో ఒక్కసారిగా బోరున విలపించారు. వెక్కివెక్కి ఏడ్చారు. తన భార్యను అవమానించేలా అసెంబ్లీలో అధికారపక్షం వాళ్లు మాట్లాడారని చంద్రబాబు గద్గద స్వరంతో తెలిపారు.
"ఇన్నాళ్ల నా రాజకీయ జీవితంలో ఎవ్వరినీ అవమానించేలా మాట్లాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగలేదు. అధికారం పోయినప్పుడు కుంగిపోలేదు. ఎవ్వరి పట్లా అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ ఇవ్వాళ నా భార్య గురించి అసెంబ్లీలో వైకాపా నాయకులు మాట్లాడిన భాష నీచంగా ఉంది. అందుకే తెదేపా అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెడతా." -చంద్రబాబు నాయుడు, తెదేపా అధ్యక్షుడు
ఎప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు ఒక్కసారిగా కన్నీటి పర్యంతం కావడంతో తెదేపా ఎమ్మెల్యేలంతా ఆయనను ఓదార్చారు. ఆయనకు అండగా ఉంటామన్నారు.
ఇదీ చదవండి: CHANDRABABU: ఇది గౌరవ సభా.. కౌరవ సభా: చంద్రబాబు