దళితులకు రక్షణగా ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్.. నిర్వీర్యం చేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత మండిపడ్డారు. అధికార పార్టీ రాజ్యంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. వైకాపా నేతల అక్రమాలను ప్రశ్నించిన వాళ్లపై అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలుకు వైకాపా నేతలతోపాటు కొందరు పోలీసులు సహకరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ అక్రమాలను దేవినేని ఉమా ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. దాడి చేసిన వాళ్లను వదిలేసి తిరిగి దేవినేని ఉమాపై కేసు పెట్టడం దారుణం అన్నారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ ఓట్లతో అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వం.. వారిని నేలకేసి కొట్టేలా వ్యవహరిస్తోందని... రాజకీయ కక్ష సాధింపు కోసం ఎస్సీలను పావుగా వాడుకుంటోందన్నారు. ప్రభుత్వంపై ఎస్సీలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆమె అన్నారు.
చట్టాన్ని చులకన చేసి ఎస్సీలను అవమానించొద్దు: జవహర్
అట్రాసిటీ చట్టాల్ని తమ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎస్సీలను అవమానించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్సీలకు శిరోముండనం చేసిన వారిని అరెస్టు చేయలేని పోలీసులు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా అట్రాసిటీ కేసులు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల్ని ప్రయోగించడం దారుణం అన్నారు. కారులోంచి బయటకు దిగని వ్యక్తిపై అట్రాసిటీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. వైకాపా ఎస్సీ నేతలు ఉపప్రణాళిక నిధులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని హితవు పలికారు.
యావత్ ఎస్సీ జాతి సిగ్గుపడుతోంది: డోలా బాలవీరాంజనేయస్వామి
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తెదేపా శాసనసభా పక్ష నేత డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. ఎస్సీల ఓట్లతో గద్దెనక్కిన జగన్ వారిని అడుగడునా అణిచివేయటం చూసి యావత్ ఎస్సీ జాతి సిగ్గుపడుతోందన్నారు. మర్రిపూడి పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎస్సీ ఎమ్మెల్యేనైనా.. తన పేరు లేకుండా చేశారు.. అలాంటి వారు అట్రాసిటీ చట్టాన్ని గౌరవిస్తామని చెప్పటం హాస్యస్పదంగా ఉందన్నారు. ఎప్సీ సిద్దార్డ్ కౌశల్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి..
Paddy Purchase: రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి: అచ్చెన్నాయుడు