స్వర్ణ ప్యాలెస్ హోటల్‌కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయా, లేవా అనే విషయాన్ని పరిశీలించకుండా రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం కొవిడ్ కేంద్రం నిర్వహణ చేపట్టడం ఆక్షేపణీయమని విజయవాడలోని ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురి నిందితుల బెయిల్ పిటిషన్లు న్యాయస్థానం కొట్టివేసింది. చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా డాక్టర్ కె. రాజగోపాలరావు స్వర్ణ ప్యాలెస్ హోటల్లో కొవిడ్ కేంద్ర నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు అప్పటికే అందులో క్వారంటైన్ కేంద్రం నిర్వహిస్తునట్లు తెలిపారు. హోటల్ యాజమాన్యం అన్ని అనుమతులు పొందినట్లు విశ్వసించామని పిటిషనర్ చెబుతున్న విషయాన్ని అంగీకరించలేమని న్యాయస్థానం పేర్కొంది. హోటల్‌తో ఒప్పందం చేసుకునేటప్పుడు పిటిషనర్ ఆసుపత్రి యాజమాన్యం అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం తెలిపింది.
నివాస ఇంటిలోకి చేరాలనుకుంటున్న సాధారణ వ్యక్తి సైతం విద్యుత్ ప్రమాదానికి తావేమన్నా ఉందా... భద్రత ఏమాత్రం ఉంది.. విద్యుత్ పరికరాలను సక్రమంగా బిగించారా లేదా పరిశీలిస్తాడు. వాటిన్నింటి విషయంలో సంతృప్తి చెందకపోతే ఆ వ్యక్తి సైతం ఆ ఇంటిలోకి చేరడని న్యాయస్థానం అభిప్రాయపడింది. హోటల్‌కు అన్ని అనుమతులున్నాయని నమ్మి ఒప్పందం చేసుకున్నామని చెప్పడం సరికాదని న్యాయస్థానం తెలిపింది. డీఎమ్హెచ్వో కొవిడ్ కేంద్ర నిర్వహణకు అనుమతిచ్చారన్న కారణంతో అగ్నిప్రమాద నివారణ జాగ్రత్తలు తీసుకోవడంలో పిటిషనర్ తన బాధ్యతలను విస్మరించడానికి వీల్లేదని పేర్కొంది. తగిన పత్రాలు లేకపోయినా డీఎమ్హెచ్వో అనుమతి ఇస్తే ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.
సంయుక్త కలెక్టర్ నివేదిక పరిశీలిస్తే .. హాటల్లో అగ్నిమాపక పరికరాలు తగినన్ని లేవని స్పష్టం అవుతోందని అవసరమైన ఫైర్ అలారం వ్యవస్థ కూడా లేదని తెలుస్తోందని న్యాయస్థానం తెలిపింది. అగ్నిమాపక పరికరాలు లేవని తెలుసుకోవాల్సిన అవసరం ఆసుపత్రి యాజమాన్యంపై ఉందని కోర్టు పేర్కొంది. ప్రమాదం చోటుచేసుకున్న రోజు వరకూ లోపాల్ని సరిదిద్దుకోకపోవడం చూస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన పెనుప్రమాదం