మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తమపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కడపకు చెందిన సునీల్ కూమార్ యాదవ్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. దిల్లీలో విచారణ చేసినపుడు సీబీఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తెల్లకాగితంపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారని కోర్టుకు తెలిపారు. ఒకవేళ విచారణ చేయాలనుకుంటే న్యాయవాది సమక్షంలో విచారణ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. సునీల్ కుమార్ నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయమివ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
రంగన్న కీలక వాగ్మూలం
వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వివేకా ఇంటి కాపలాదారు రంగన్న..జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో.. భాగంగా సీబీఐ రంగన్నను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. చివరికి ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. సుమారు 45 నిమిషాలపాటు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సమయంలో.. కోర్టు గదిలో రంగన్నతో పాటు న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. ఇతరులు ఎవ్వరికీ లోనికి అనుమతి ఇవ్వలేదు. ఈ వాంగ్మూలాన్ని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టు.. న్యాయమూర్తికి పంపనున్నారు. రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు ఉన్నాయని, హత్యకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ఆయన వివరించారని ప్రచారం జరుగుతోంది.
తన పేరు ఎవరికైనా చెబితే నరికి చంపుతానని ఎర్ర గంగిరెడ్డి బెదిరించారని.. అందుకే తాను భయపడి ఎవరికీ ఏమీ చెప్పలేదని రంగన్న తెలిపారు. సీబీఐ అధికారులు తనపై ఈగ వాలనివ్వబోమని హామీ ఇచ్చినట్లు వివరించారు. న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమిచ్చిన.. అనంతరం పులివెందులలో స్థానికులు, విలేకర్లతో రంగన్న ఈ విషయాలు వెల్లడించారు. న్యాయమూర్తికి ఏం చెప్పావని అడిగితే.. తనకు భయమేస్తోందని సమాధానం ఇచ్చారు. భయపడాల్సిన పని లేదని పదేపదే అడగ్గా.. అక్కడున్నవారి చెవిలో.. ఎర్ర గంగిరెడ్డి, వివేకా పాత డ్రైవర్ దస్తగిరి, సునీల్‌కుమార్ పేర్లను చెప్పారు.
ఇదీ చదవండి
viveka murder case: వివేకా హత్య కేసులో.. రంగన్న చెప్పిన కీలక విషయం ఏంటి?