ప్రముఖులు వస్తున్నప్పుడు ఆ మార్గంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేసుకుంటూ అధికారులు కార్లు, జీపుల్లో వెళ్లటం చూస్తుంటాం. కానీ విజయవాడలో వీటి స్థానంలో అధునాతన ద్విచక్ర వాహనాలను వినియోగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుజుకి సంస్థ ప్రతినిధులు 5 నూతన ద్విచక్ర వాహనాలను విజయవాడ ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. ఈ వాహనాలను విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు కమిషనరేట్ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ప్రారంభించారు. నగర ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సైతం ఈ వాహనాలను వినియోగించనున్నట్లు సీపీ తెలిపారు.
ఈ ద్విచక్ర వాహనాలు సాధారణమైనవి కావని, స్టార్ట్ చేసిన 6 సెకన్లలోపే 60 కిలోమీటర్ల వేగం అందుకుంటాయని, వాహనంపై వెళ్తూనే ట్రాఫిక్ సిబ్బంది మాట్లాడేందుకు వీలుగా హెల్మెట్‌కు మైక్ ఏర్పాటు చేశారని సీపీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు సంఘటనా స్థలాలకు త్వరగా వెళ్లేందుకు, ట్రాఫిక్ ఉల్లంఘనులను పట్టుకునేందుకు ఈ తరహా వాహనాలు ఉపయోగపడతాయని అన్నారు.